భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ పాల్వంచ రూరల్, డిసెంబర్ 15: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను రాష్ట్ర పర్యాటక శాఖ కొన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించింది. ఇందులో భాగంగా జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రత్యేక ఏజెన్సీ బృందాలను జిల్లాకు రప్పించారు. ఆ బృందాల్లోని రెయిన్ వాటర్ ప్రాజెక్టు, స్టూడియో పంచతంత్ర టీముల సభ్యులు, కలెక్టర్ కలిసి ఆదివారం జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా కిన్నెరసాని అభయారణ్యాన్ని సందర్శించారు. దీని ప్రత్యేకతల గురించి కలెక్టర్ జితేశ్ ఆయా సభ్యులకు వివరించారు. ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం చేపడుతున్న పనులు, తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు.
అనంతరం కిన్నెరసాని ప్రాజెక్టులో బోటులో ప్రయాణించి ఆనంద ద్వీపాన్ని సందర్శించారు. డ్రోన్ కెమెరా ద్వారా కిన్నెరసాని అభయారణ్యం అందాలను బృంద సభ్యులు వీక్షించారు. జింకల పార్కు, ప్రాజెక్టు బాతుల పార్కును పరిశీలించారు. అనంతరం కిన్నెరసాని ప్రాజెక్టు, కేటీపీఎస్ కుడి కాలువలో పుట్టిలో ప్రయాణించారు. అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
తదుపరి గోదావరి ఘాట్‌ను సందర్శించారు. అనంతరం భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నిర్మిస్తున్న గిరిజన మ్యూజియాన్ని సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజనుల ప్రత్యేక వంటకాల గురించి బృందాలకు కలెక్టర్ వివరించారు. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయం, నార చీరెల ప్రాంతం సందర్శించి అక్కడ స్థల పురాణం, ప్రత్యేకతలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుజ్జిగుప్ప నారాయణరావుపేట గ్రామంలో బృంద సభ్యులు పర్యటించారు.