భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఇంటింటి సర్వే వివరాలను పకడ్బందీగా ఆన్లైన్లో నమోదు చేయాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సూచించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లతో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని తగు సూచనలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా కొనసాగుతున్నదని, అదే మాదిరిగా సర్వే వివరాలను డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. కుటుంబాల వివరాలు అంశాల వారీగా ప్రత్యేక ఫార్మాట్లో నమోదు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీపీవో సంజీవరావు, మాస్టర్ ట్రైనీలు పాల్గొన్నారు.