భద్రాచలం, నవంబర్ 20: జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి డిసెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే ముక్కోటి అధ్యయనోత్సవాలను విజయవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముక్కోటి ఏర్పాట్లపై భద్రాచలం సబ్ కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల్లో భాగంగా గోదావరి నదిలో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వేడుకలకు దేశవ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉత్తర ద్వార దర్శన సమయంలో టికెట్లు లేకుండా సెక్టార్లలోకి ఎవరినీ అనుమతించొద్దని స్పష్టం చేశారు.
ప్రొటోకాల్, వీవీఐపీ, వీఐపీ సెక్టార్లలోకి కూడా పాస్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతించాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా పట్టణంలో పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యమివ్వాలని, ఇందుకోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పారిశుధ్య సిబ్బందిని అదనంగా తీసుకురావాలని డీపీవో అనూషను ఆదేశించారు. హోటళ్లలో ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేపట్టాలని, సబ్ కలెక్టర్ నిర్దేశించిన రేట్లకే హోటళ్లలో తినుబండారాలు విక్రయించాలని సూచించారు. తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం సమయాల్లో పట్టణంతోపాటు ఏపీలోని యటపాకలో ఉన్న బార్లు, బెల్టు షాపులు మూసివేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఏరు ఫెస్టివల్ కోసం సంబంధించిన ఏర్పాట్లు త్వరలోనే మొదలవుతాయని తెలిపారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట సమన్వయం చేసుకొని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించడంతోపాటు డివిజన్‌స్థాయి సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. దేవస్థాన అనుబంధ ఆలయమైన పర్ణశాలలో సైతం ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీవో రాహుల్, పాల్వంచ డీఎస్పీ సతీశ్, అగ్నిమాపక శాఖ డీఎఫ్‌వో క్రాంతికుమార్, డీఆర్డీవో విద్యాచందన తదితరులు పాల్గొన్నారు.