భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 7 (నమస్తే తెలంగాణ): అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన, పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, ధరణి ధరఖాస్తులపై కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని ఆదేశించారు. సమన్వయంతో పనిచేసి ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. ఇంకుడు గుంతల నిర్మాణాలు, ఫారం పాండ్స్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు. ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు మార్చి 31 వరకు కల్పిస్తున్న 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని, పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.