పాల్వంచ రూరల్, డిసెంబర్ 28: విద్యార్థులు తమ పాఠ్యాంశాలపై పట్టు సాధిస్తేనే విజయం సాధ్యమని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. విద్యార్థులు కూడా బట్టీ చదువుల పద్ధతిని మానుకోవాలని, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలని సూచించారు. ఎంతో చరిత్ర కలిగిన కిన్నెరసాని గురుకుల పాఠశాల సమస్యలను ఏడాదిలోపు పరిష్కరిస్తానని అన్నారు. మండలంలోని కిన్నెరసాని గురుకుల పాఠశాల 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన స్వర్ణోత్సవంలో కలెక్టర్ మాట్లాడారు.
పాఠశాలకు ప్రధానమైన కాంపౌండ్ వాల్, డార్మెటరీ షెడ్ నిర్మాణం సహా ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తానని అన్నారు. విద్యార్థులు కూడా కష్టపడి చదివి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇప్పటికే విజయాలు సాధించిన సీనియర్ల సలహాలు పాటించాలని సూచించారు. అలాగే, పాఠశాలకు ఉపయోగపడే విధంగా వితరణ చేయాలని పూర్వ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం, ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ.. స్వర్ణోత్సవ వేడుకకు తెలుగు రాష్ర్టాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 2,500 మంది పూర్వ విద్యార్థులు హాజరు కావడం గొప్ప విషయమని అన్నారు. ఏపీవో డేవిడ్ రాజ్, ప్రిన్సిపాళ్లు శ్యామ్‌కుమార్, రమేశ్, ఖమ్మం ఆర్సీవో అరుణకుమారి, కిన్నెరసాని సర్పంచ్ వజ్జా రామకృష్ణ పాల్గొన్నారు.