పాల్వంచ రూరల్, మార్చి 8 : విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆకాంక్షించారు. లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన వాల్ పోస్టర్ను కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కళాశాల అటానమస్ గుర్తింపుతో డాక్టరేట్ పొందిన ప్రొఫెసర్ల సారథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు.
విశాలమైన క్రీడా మైదానం, లైబ్రరీ, ల్యాబ్ తదితర సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. అధ్యాపకులు చెప్పే పాఠాలు వింటూ విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధతో చదివితే ఉన్నత ఫలితాలు సాధించవచ్చన్నారు. డిగ్రీ విద్యనభ్యసించేందుకు విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రభుత్వ కళాశాలల్లో చేరి సమయం వృథా చేయకుండా చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.మాధవి, డి.రమేశ్, వేముల కామేశ్వరరావు, పీడీ పోట్లపువ్వు శ్రీనివాసరావు, ఎన్.శ్రీదేవి, దీపిక, హారిక తదితరులు పాల్గొన్నారు.