భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): త్వరలోనే జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ఐసీడీఎస్ కార్యాలయాల భవన నిర్మాణాలకు స్థలాలు కేటాయిస్తామని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ చేపడుతున్న ఐసీడీఎస్ కార్యకలాపాలు, చైల్డ్ ప్రొటెక్షన్, అడాప్షన్, చైల్డ్ హెల్ప్‌లైన్‌పై బుధవారం అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలు, స్థలం వివరాలు అందజేయాలని సీడీపీవోలను ఆదేశించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. లోప పోషణకు గురైన పిల్లలను సాధారణ స్థితికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో మునగ, కరివేపాకు, ఉసిరి, చింత, వెలగ మొక్కలు తప్పనిసరిగా నాటాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనీనా, ప్రాజెక్టు సీడీపీవోలు, సీడబ్ల్యూసీ మెంబర్లు, డీసీపీయూ యూనిట్, చైల్డ్ హెల్ప్ సిబ్బంది పాల్గొన్నారు.