భద్రాచలం, జనవరి 10: గోదావరి తీర ప్రాంతంలో పలు పర్యాటక ప్రదేశాలను గుర్తించినట్లు రెయిన్ వాటర్ ప్రాజెక్టు బృందం, స్టూడియో పంచతంత్ర బృందం సభ్యులు తెలిపారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ ఆదేశాల మేరకు రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ సీఈవో కల్పనా రమేశ్ బృందం సభ్యులతో కలిసి శుక్రవారం భద్రాచలంలోని గిరిజన మ్యూజియంలోని కళాఖండాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులు వారి సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించి పాత కాలపు కళాఖండాలను ఎగ్జిబిషన్ రూపంలో పర్యాటకులకు చూపడమే కాకుండా వాటి విక్రయాల ద్వారా ఉపాధి పొందాలన్నారు. రాజుల కాలం నాటి కట్టడాలు, దిగుడు బావులు, మెట్ల బావులు వాడకంలో లేకపోవడంతో చెత్తాచెదారంతో నిండిపోయాయని, వాటిని వినియోగంలోకి తెచ్చుకోవాలని గ్రామస్తులకు సూచించామన్నారు. పర్యాటకానికి అనువుగా ఉన్న భద్రాద్రి జిల్లాలోని గ్రామాలను కలెక్టర్, ఐటీడీఏ పీవో సూచన మేరకు స్థలాలను గుర్తించామన్నారు. కార్యక్రమంలో బృంద సభ్యులు నిహారిక, శ్రావణి, ఆదిత్య, ప్రాజెక్టు మేనేజర్ వెంకటేశ్, పంచతంత్ర బృందం సభ్యులు, మ్యూజియం ఇన్చార్జి వీరాస్వామి పాల్గొన్నారు.