భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ కొత్తగూడెం అర్బన్, నవంబర్ 30: ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని భదాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, పీఎం కుసుమ్ పథకం, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ తదితర అంశాలపై అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందనతో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో శనివారం నిర్వహించిన సమీలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియర్ చేయాలన్నారు. దరఖాస్తులు ఏ కారణాలతో పరిష్కరించబడలేదో లిఖితపూర్వక సమాచారాన్ని పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. సమగ్ర ఇంటింటి సర్వే డేటా ఎంట్రీ వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించాల్సిందిగా అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌కు సూచించారు. సోలార్ పవర్‌ప్లాంట్ స్థాపనకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లు గడిచిన రెండేళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయని, తక్షణమే వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేశ్ ఆదేశించారు. షాపింగ్ కాంప్లెక్స్‌లను శనివారం ఆయన పరిశీలించారు. మున్సిపల్ షాపింగ్‌కాంప్లెక్స్‌లో మహిళా సంఘాలతో ఫుడ్‌కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వివిధ రకాల టిఫిన్లు, స్నాక్స్, భోజనంతోపాటు రుచికరమైన ఆహార పదార్థాలను మహిళా సంఘాలు తయారు చేసుకొని ఇక్కడే వ్యాపారాలు జరిపేలా చూస్తామన్నారు. కమిషనర్ శేషాంజన్‌స్వామి, కౌన్సిలర్ రుక్మాంగధర్ బండారి పాల్గొన్నారు.