దమ్మపేట, అక్టోబర్ 4: ప్రభుత్వం చేపడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుక్రవారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ మండలంలోని అల్లిపల్లిని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నిర్వహిస్తున్న సర్వేను పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
కొత్తగా పెళ్లయిన వారిని, జన్మించిన వారిని ఈ సర్వేలో నమోదు చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, నాయకులు కేవీ సత్యనారాయణ, కొయ్యల అచ్యుతరావు, చిన్నశెట్టి యుగంధర్, ఎర్ర వసంతరావు, సాయిల నర్సింహారావు పాల్గొన్నారు.
ములకలపల్లి, అక్టోబర్4: ప్యామిటలీ డిజిటల్ కార్డ్ సర్వేలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద మండలంలోని ముత్యాలంపాడు గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే నాలుగు రోజుల పాటు కొనసాగుతుందన్నారు. అనంతరం మూకమామిడి వద్ద నిర్మిస్తున్న ఏకవల్య పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. పదిహేను రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట స్పెషలాఫీషర్ టీ సుమ, ఎంపీడీవో మహాలక్ష్మి, తహసీల్దార్ పుల్లారావు, ఆర్ఐ భద్రు, ఎంపీవో లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ, సెప్టెంబర్ 4: ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో బహుళ ప్రయోజనాలు ఉంటాయని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టణంలోని బొల్లోరుగూడెం పదవ వార్డులో డిజిటల్ కార్డ్ పైలెట్ ప్రాజెక్ట్ సర్వేను శుక్రవారం ప్రారంభించారు. స్థానికులతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలును సులభతరం చేసేందుకు డిజిటల్ కార్డు దోహదపడుతుందని అన్నారు. ఆర్డీవో మధు, తహసీల్దార్ వివేక్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లెందు రూరల్, అక్టోబర్ 4: మండలంలోని పూబెల్లి గ్రామంలో డిజిటల్ కార్డు సర్వేలో భాగంగా అధికారులు ఇంటింటికెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది ఉన్నారనేది నమోదు చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.