కొత్తగూడెం ఎడ్యుకేషన్, నవంబర్ 24: విద్యార్థులు ఒక లక్ష్యంతో జీవితంలో స్థిరపడేందుకు కృషిచేయాలని, తమకు ఇష్టమైన రంగాలను ఎంచుకొని ఆ దిశగా ముందుకు సాగాలని జిల్లా జడ్జి పాటిల్ వసంత్, కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు.
కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వసతిగృహ విద్యార్థులకు ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడోత్సవాల ముగింపు వేడుకల్లో వారు మాట్లాడారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే విద్యతోపాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. క్రీడలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసమే కాకుండా సమాజంలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని వివరించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి ఇందిర, వివిధ వసతి గృహాల సంక్షేమ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.