
ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ రెవిన్యూ, భూసర్వే అధికారులను ఆదేశించారు. రఘునాథపాలెం తహసీల్దార్ కార్యాలయం కం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూముల రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో మండల పరిధిలోని చింతగుర్తి రెవిన్యూలోని 266సర్వే నెంబర్ ప్రభుత్వ భూములను కలెక్టర్ పరిశీలించారు. రఘునాథపాలెం మండల కేంద్రంలో బృహత్ పల్లె ప్రకృతి వనం కోసం గుర్తించిన 14కరాల విస్థీర్ణం గల స్థలాన్ని కలెక్టర్ పరిశీలించి సత్వరమే మొక్కలను నాటే ప్రక్రియను మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు అహ్లాదకరంగా, చిన్నారులకు ఆటవిడుపుగా ఉండే విధంగా బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సుందరంగా ఏర్పాటు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. రఘునాథపాలెం కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయానికి ఆటస్థలం ఏర్పాటుకు గానూ మూడెకరాల స్థలాన్ని కూటాయించాలని, ఐటీడీఏ ఆధ్వర్యంలో నడస్తున్న స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ పాఠశాలకు ఏడెకరాల స్థలాన్ని కేటాయించాలని రెవిన్యూ అధికారులకు ఆయన సూచించారు.
అనంతరం రఘునాథపాలెం రైతు వేదిక ప్రాంగణంలోని భూసార పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతువేదిక ద్వారా రైలుకు వ్యవసాయ అనుబంధ రంగాలలో వివిధ పంటల సాగు, ఆదునిక పద్దతులను తెలియజేయడంతో పాటు భూసార పరీక్షల ద్వారా అనుకూల పంటసాగును తెలియజేయాలని సూచించారు.ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ బీ రాహూల్, ఆర్డీవో రవీంద్రనాథ్, సర్వేఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీవి రాము, తహసీల్దార్ నర్సింహారావు, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.