జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. సోమవారం ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేసి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఓటు ప్రాధాన్యతాక్రమంలో వేయాలి కాబట్టి, ఓటు ఇన్వాలిడ్ అవ్వకుండా ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. పట్టభద్రులందరూ ఓటుహకు వినియోగించుకోవాలని సూచించారు.

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కలెక్టర్ వి.పి గౌతమ్ దంపతులు ఓటు హకు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 118 పోలింగ్ కేంద్రాల్లో ప్రతి రెండు గంటలకు ఒక సారి అధికారులు పోలింగ్ సరళిని ప్రకటించారు. ఉదయం 8 గంటలకే ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో ఉదయం 10 గంటలకు 13.01 శాతం, మధ్యాహ్నం 12 గంటలకు 30.06, 2.00 గంటలకు 49.00, సాయంత్రం 4.00 గంటలకు 65.54గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

చివరి నిమిషంలో క్యూలైన్‌కు వచ్చిన ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునేందకు అవకాశం కల్పించడంతో జిల్లాలో ఓటింగ్ శాతం 67.63గా నమోదైంది. ప్రజాప్రతినిధులు, నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేసవి దృష్ట్యా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. తాగునీరు, వైద్య శిబిరం, షామియానాలు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
– నెట్వర్క్