భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. మంగళవారం ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి ఆన్లైన్ ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను ఆయా మండలాల ఎంపీడీవోలు కార్యాలయాల్లో ఆన్లైన్ చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేయడంతోపాటు వాటి సమాచారం గోప్యంగా ఉంచాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3,33,225 దరఖాస్తులు రాగా.. వాటిలో 1,90,870 దరఖాస్తులను ఆన్లైన్ చేశామన్నారు. మొత్తంగా 60 శాతం ప్రక్రియ పూర్తయిందన్నారు. 22 మండలాల్లో 2,75,402 దరఖాస్తులు రాగా.. 1,63,493 ఆన్లైన్ అయ్యాయన్నారు. మున్సిపాలిటీల పరిధిలో 57,823 దరఖాస్తులు రాగా.. అందులో 27,377 ఆన్లైన్ అయినట్లు వివరించారు.