భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకింగ్(ఎఫ్ఎల్సీ) పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. సోమవారం కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయ ప్రాంగణం, లక్ష్మీదేవిపల్లి మండలం రామచంద్ర కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను, ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో సోమవారం నుంచి 15వ తేదీ వరకు వివిధ పార్టీల ప్రతినిధులు సమక్షంలో వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల మధ్య ఎఫ్ఎల్సీ ప్రక్రియను ఇంజినీర్ల పర్యవేక్షణలో అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఎన్నికల సంఘం జిల్లాకు 1,588 బ్యాలెట్ యూనిట్లు 1,424 కంట్రోల్ యూనిట్లు, 1,633 వీవీ ప్యాట్ యంత్రాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో ఈవీఎంల పనితీరును పరిశీలించడానికి మొదటి దశ పరిశీలన అత్యంత ముఖ్యమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ఎన్నికల విభాగం తహసీల్దార్ దారా ప్రసాద్, కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య, నాయబ్ తహసీల్దార్ రంగా ప్రసాద్, ఈసీఐఎల్ ఇంజినీర్లు, వివిధ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, ఎన్నికల సిబ్బంది నవీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.