మామిళ్లగూడెం, జూలై 4 : ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం తాగునీటి సమస్య లేదని, మున్నేరు, పాలేరు, వైరా ప్రధాన జలాశయాల నుంచి ప్రజల తాగునీటి అవసరాలకు తగినంత నీరు అందుబాటులో ఉందని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానకాల పరిస్థితులు, తాగునీటి సరఫరా, వ్యవసాయ అవసరాలు, ఎరువులు- విత్తనాల లభ్యత, ప్రజారోగ్యం, వరదల సన్నద్ధత, విద్యాశాఖ అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పంట మార్పిడి విధానాలు, ఆయిల్‌పామ్ పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ జిల్లాలోని పరిస్థితులను సీఎస్‌కు వివరించారు. విత్తనాల విక్రయ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నదని, అక్రమాలకు పాల్పడిన ఒకరిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నదని తెలిపారు.
వరదల సన్నద్ధతపై ఇప్పటికే పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించామని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, వ్యవసాయ, ఉద్యానవన, వైద్యారోగ్యశాఖ, సంక్షేమశాఖ, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.