‘జిల్లాలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలి. పనిచేయడం ఇష్టం లేకుంటే తక్షణమే సెలవుపై వెళ్లండి. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.’
ఇవీ.. ఇటీవలి రెవెన్యూ శాఖ సమీక్షలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఆ శాఖ అధికారుల పనితీరుపై కలెక్టర్ అనుదీప్ చేసిన ఆదేశాలు, హెచ్చరికలు.
రెవెన్యూ శాఖ కనబరిచే మెరుగైన పనితీరు ఆధారంగానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కలెక్టర్ ఆ సమీక్షలో స్పష్టం చేశారు. 15 రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని గడువు విధించారు. అయినా, రెవెన్యూ అధికారుల్లో ఏమాత్రమూ చలనం లేకుండా పోయింది. కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు చేసినప్పటికీ జిల్లాలోని రెవెన్యూ శాఖ అధికారులు ఆ ఆదేశాలను బేఖాతరు చేశారు. జిల్లాలో ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో 90 శాతం దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండడం గమనార్హం. ఫైళ్లు క్లియర్ కావాలంటే కిందిస్థాయి రెవెన్యూ అధికారులు ప్రతి పనికీ రేట్ ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా భూ భారతి పోర్టల్‌ను తెచ్చినా తమకు ఎలాంటి ప్రయోజనమూ లేదని, భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– రఘునాథపాలెం, నవంబర్ 10
రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ధరణి’ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా భూములకు సంబంధించిన పనులను రైతులకు సులభతరం చేశారు. కానీ, రెండేళ్ల కిత్రం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ‘ధరణి’పై అక్కసును వెళ్లగక్కింది. దాని స్థానంలో ఎంతో ఆర్భాటంగా ‘భూ భారతి’ అనే పోర్టల్ తీసుకొచ్చింది. ఎంతో ఘనకార్యం చేసినట్లు, రైతుల సమస్యలన్నింటినీ పరిష్కరించినట్లు ప్రచారం చేసుకుంది. కానీ, క్షేత్రస్థాయిలో ఈ పోర్టల్ ద్వారా రైతుల సమస్యలకు మాత్రం పరిష్కారం చూపలేకపోయింది. దీంతో తమ భూముల సమస్యలు ఎక్కడివి అక్కడే ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చేతులు తడపాల్సిందే..
‘మా భూముల సమస్యల పరిష్కరించండి సారూ..’ అంటూ రెవెన్యూ శాఖ అధికారుల చుట్టూ రైతులు ఎన్ని వేలసార్లు ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం కన్పించడం లేదు. చేతులు తడిపితే తప్ప ఫైళ్లు కదలని దుస్థితి. దీనికితోడు కాంగ్రెస్ సర్కారు ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్ రెవెన్యూ అధికారుల అవినీతికి మరింత ఆజ్యం పోసినట్లయింది. సమస్యల పరిష్కారం పేరుతో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డబ్బులిస్తేనే ఫైళ్లు క్లియర్ చేయడం, లేకుంటే రైతులను నెలల తరబడి, ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పడం రివాజుగా మారింది. దీంతో కర్షకులు కంటతడి పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఇటీవల భూమి రిజిస్ట్రేషన్ కోసం భద్రాద్రి జిల్లా ములకలపల్లిలో ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఓ గ్రామ పరిపాలన అధికారి(జీపీవో) ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం విదితమే. అదే క్రమంలో మరికొందరు రెవెన్యూ అధికారులూ ఏసీబీ దాడుల్లో పట్టుబడిన సంఘటనలూ అనేకం ఉన్నాయి.

పరిష్కారానికి నోచుకోని దరఖాస్తులు
భూ భారతిలో భాగంగా ఖమ్మం జిల్లాలో నిర్వహించిన దరఖాస్తుల్లో 90 శాతానికి పైగా పరిష్కారానికి నోచుకోలేదు. మచ్చుకు రఘునాథపాలెం మండలాన్ని పరిశీలించినా విషయం బోధపడుతుంది. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా సక్సేషన్, మ్యుటేషన్ తదితర దరఖాస్తులు మొత్తం 3,494 అందాయి. అయితే, వీటిల్లో కేవలం 68 దరఖాస్తులకు మాత్రమే పరిష్కారం లభించినట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే, ‘దరఖాస్తు చేసుకున్నాం గానీ రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు విచారణకు రాలేదు’ అంటూ దరఖాస్తు చేసుకున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వచ్చిన దరఖాస్తులపై ముందుగా గ్రామ పరిపాలన అధికారులు విచారణ చేసి గిర్దావర్లకు రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఆ రిపోర్టును తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ పరిశీలించాలి. కానీ, డబ్బులు ఇవ్వనిదే తహసీల్దార్ కార్యాలయంలోని ఫైళ్లు కదలడం లేదని కొందరు రైతులు, దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఓ వైపు ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నా, మరోవైపు స్వయంగా కలెక్టరే ఆదేశాలు జారీ చేసినా.. రెవెన్యూ అధికారులు మాత్రం ఫైళ్లు క్లియర్ చేయకుండా పెండింగ్‌లో పెడుతుండడం గమనార్హం.