కారేపల్లి, జూలై 28 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల కేంద్రంలో సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా కారేపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. పాఠశాల ప్రాంగణమంతా కలియతిరిగి పరిసరాలను పరిశీలించారు. స్కూల్ ఆవరణంలో చెత్తాచెదారం, దుర్వాసనతో కూడిన అపరిశుభ్రత నెలకొనడంతో ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంప్యూటర్, సైన్స్ ల్యాబ్ లు, పుస్తకాలు, విద్యార్థుల యూనిఫామ్, క్రీడా సామగ్రి నిల్వ ఉంచే గదులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదుల్లోకి ప్రవేశించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులతో పుస్తకాల్లోని పాఠాలను చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులను భోజనశాలలో కలిసి రుచి, ప్రామాణ్యతపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పదో తరగతి ఉత్తీర్ణ శాతం పెంచడంతో పాటు నాణ్యమైన విద్యా బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అదేవిధంగా కారేపల్లి సహకార పరపతి సంఘం కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. సొసైటీ ద్వారా రైతులకు అందజేస్తున్న ఎరువులను పరిశీలించారు. ఎరువుల పంపిణీలో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని సొసైటీ సీఈఓకు సూచించారు. అనంతరం కారేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పీహెచ్సీ కి వచ్చిన రోగులతో మాట్లాడి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వైద్య సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు గ్రామాల్లో అవగాహనలు కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
సీజనల్ వ్యాధుల నివారణ పట్ల గ్రామాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక కొరత లేకుండా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట మండల తాసీల్దార్ అనంతుల రమేశ్, ఎంపీడీఓ రవీంద్ర ప్రసాద్, మండల విద్యాశాఖ అధికారి జయరాజు, మండల వ్యవసాయ శాఖ అధికారి బట్టు అశోక్ కుమార్, ఆర్ఐ నరసింహారావు, ఎస్ఐ గోపి, మండల వైద్యాధికారి బి.సురేశ్, ఆర్ డబ్ల్యుఎస్ ఏఈ నరేందర్ ఉన్నారు.
Karepalli : కారేపల్లి మండల కేంద్రంలో కలెక్టర్ అనుదీప్ ఆకస్మిక తనిఖీలు
Karepalli : కారేపల్లి మండల కేంద్రంలో కలెక్టర్ అనుదీప్ ఆకస్మిక తనిఖీలు