మామిళ్లగూడెం, నవంబర్ 24: ప్రభుత్వ అధికారులు తమ విధులను జవాబుదారీతనంతో సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రభుత్వం కార్యక్రమాలు, వాటి అమలు, నిర్వహణపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. మండల ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జిల్లా అధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ప్రజావాణికి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రతి శుక్రవారం ప్రత్యేకాధికారులు తాము సందర్శించి, అందించిన ఫీడ్ బ్యాక్ నివేదికలను తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు అందించాలని, జిల్లా అధికారులు తమ వద్ద ఈ సమాచారం ఎప్పుడూ అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని, జిల్లా అధికారులు తమ పరిధిలోని సిబ్బంది ఎన్నికల విధులు పక్కాగా నిర్వహించేలా అవగాహన కల్పించాలని సూచించారు. డీఆర్వో పద్మశ్రీ, జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ అపూర్వ, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.