మామిళ్లగూడెం, నవంబర్ 1 : క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా తుపానుతో దెబ్బతిన్న పంటల నష్టం నివేదిక తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మొంథా తుపాన్ నష్టం నివేదిక తయారీపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శనివారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంట నష్టం అంచనాపై నివేదికలు రూపొందించే విషయంలో ఎక్కడా తప్పులు ఉండటానికి వీల్లేదని సూచించారు. నష్టం జరిగిన ప్రతి రైతుకూ ప్రభుత్వం నుంచి పరిహారం అందే విధంగా చూడాలని ఆదేశించారు. నివేదికలను పూర్తి పారదర్శకంగా రూపొందించాలని, వీటిని మళ్లీ క్రాస్ చెక్ చేస్తామని, అందులో తప్పులున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఆర్వో పద్మశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.