మామిళ్లగూడెం, సెప్టెంబర్ 14 : ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడానికి మిగులు భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారుల సంస్థ, రెవెన్యూ అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం- దేవరపల్లి, నాగపూర్- అమరావతి జాతీయ రహదారుల నిర్మాణం నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మం- దేవరపల్లి రహదారికి ధంసలాపురం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ కోసం 6.22 ఎకరాల భూసేరణ చేయాలన్నారు.
ఇందులో 3.16 ఎకరాలకు ఇప్పటికే అవార్డు పాస్ చేశామని, మిగతా 3.06 ఎకరాలకు భూ సేకరణకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. నాగపూర్- అమరావతి ప్యాకేజీ-1, 2 భూసేకరణ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అక్టోబర్‌లోపు పరిహారం చెల్లింపులు పూర్తి చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. సంబంధితశాఖల సమన్వయంతో ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఎన్హెచ్ఏఐ పీడీలు రామాంజనేయరెడ్డి, దివ్య, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.