ఖమ్మం, జూన్ 16: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్.. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూం ఇండ్లపై అసెంబ్లీ నియోజకవర్గ ప్రత్యేకాధికారులతో సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గ పరిధిలో 3,500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతీ మండలం, గ్రామానికి మొదటి విడతలో కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల సంఖ్య ప్రకారం.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇందిరమ్మ కమిటీల నుంచి వచ్చిన జాబితాను మరోసారి ధ్రువీకరణ చేసి ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు. పెండింగ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, ప్రొసీడింగ్స్ పంపిణీ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా మిగిలిన డబుల్ బెడ్రూం ఇండ్లపై నివేదిక అందించాలన్నారు. అర్హులైన నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇండ్లు చేరాలని, గతంలో కేటాయించని వాటికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ కమిటీ నుంచి జాబితా తీసుకొని అధికారులు వెరిఫై చేసిన తర్వాత లబ్ధిదారుల ఎంపిక చేయాలన్నారు.
జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనుల పూర్తి కోసం అవసరమైన నిధుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ పైలట్ గ్రామాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇందిరమ్మ ఇండ్లలో ఇప్పటివరకు 500లకు పైగా గ్రౌండింగ్ చేశామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో దీక్షా రైనా, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, డీపీవో ఆశాలత, డీఎల్పీవో రాంబాబు, ఆర్డీవోలు జి.నరసింహారావు, ఎల్.రాజేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.