ఖమ్మం రూరల్, జూన్ 19 : భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను భూభారతి చట్టం నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఏదులాపురం గ్రామంలో గురువారం జరిగిన రెవెన్యూ సదస్సులో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు తీసుకున్న కలెక్టర్.. వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందన్నారు. అలాగే ఏదులాపురం చెరువు శిఖం కబ్జాపై ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. అనంతరం ఏదులాపురం చెరువు, మిషన్ భగీరథ ఇన్‌టేక్‌వెల్ పంపుహౌస్‌ను పరిశీలించారు. భవిష్యత్ తరాల కోసం చెరువు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.
గ్రామంలోని పల్లె దవాఖాన, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ తనిఖీ చేశారు. పల్లె దవాఖాన ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సబ్ సెంటర్ పరిధిలో రోగులు, గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలు, దవాఖానలో మందుల నిల్వల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ పి.రాంప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.