ఖమ్మం/ మామిళ్లగూడెం, నవంబర్ 14: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఖమ్మం నగర పరిధిలోని ఆర్అండ్బీ, మున్సిపల్ రోడ్ల నిర్వహణ, మరమ్మతు పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న 20 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి స్పీడ్ కంట్రోల్‌కు రంబుల్ స్ట్రిప్స్, సైన్‌బోర్డ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రోడ్లపై లైన్ మారింగ్ ఉండేలా చూడాలని, లైన్ మారింగ్ వినియోగం వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. ప్రధాన జంక్షన్ల వద్ద గో స్లో వైట్ పేయింట్ వేయాలని సూచించారు. నూతన రోడ్లు వేసే సమయంలో కచ్చితంగా డ్రైయిన్ నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దానవాయిగూడెంలో టీజీఎస్‌డబ్ల్యూఆర్ పాఠశాల, కళాశాల మరమ్మతు పనులకు సంబంధించి రూ.3 కోట్ల 80 లక్షల నిధులు కేటాయింపు జరిగిందని, పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబు, ఈఈ పవార్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, విద్యాశాఖ ఈఈ బుగ్గయ్య, మున్సిపల్ డీఈ ధరణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.