కూసుమంచి, జూలై 25 : వజ్రం కూడా ఒత్తిడిని తట్టుకొనే తయారవుతుందని, జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగేందుకు ప్రతి విద్యార్థి పట్టుదలతో విద్యలో రాణించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం కూసుమంచి మండల కేంద్రంలోని ఇంటర్, డిగ్రీ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో కూడా విద్యార్థులు మంచిగా చదవగలరనే అభిప్రాయాన్ని తల్లిదండ్రులకు కలిగేలా బోధన చేయాలని అధ్యాపకులకు సూచించారు.
ఇంజినీరింగ్, మెడిసిన్ పోటీ పరీక్షలకు విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యత గురువులపైనే ఉందన్నారు. చదువుకునే సమయంలో సెల్ఫోన్లో రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తే భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా ఉంటుందని విద్యార్థులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, కళాశాల అధ్యాపకులు ఉన్నారు.
నేలకొండపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలని సిబ్బందిని ఆదేశించారు. వైద్య పరీక్షలు చేస్తున్న తీరు, పరిసరాలను ఆయన పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో నిత్యం సిబ్బంది పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.