మామిళ్లగూడెం, ఆగస్టు 1 : నగరంలోని మున్నేరు అభివృద్ధి పనులతోపాటు భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణ అభివృద్ధి పనులు, భూ సేకరణ, భూ నిర్వాసితులకు ఇచ్చే లే అవుట్ పనులపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో నిర్వాసితులకు స్థలాలు ఇవ్వనున్న లే అవుట్ పనుల పురోగతిని, 10 మీటర్ల ఓవర్ బ్రిడ్జి నిర్మాణ నమునా తదితర అంశాలపై అధికారులు వివరించారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ వర్కింగ్ మ్యాప్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఖమ్మం రూరల్, అర్బన్ మండలాల్లో రైతులు అంగీకరించిన స్థలం, ప్రభుత్వ పట్టా భూముల్లో పనులు వేగవంతం చేయాలన్నారు.
రైతుల పొలాలకు ప్రత్యామ్నాయంగా ప్లాట్లను కేటాయిస్తున్నామని, లే అవుట్ ప్లాట్లలో అంతర్గత రోడ్లు, స్ట్రీట్ లైట్లు, విద్యుత్ సరఫరా పనులు వేగవంతం చేయాలన్నారు. రైతులకు లే అవుట్లో జరిగే అభివృద్ధి పనులు చూపించి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి భూములు స్వచ్ఛందంగా అప్పగించే విధంగా కృషి చేయాలన్నారు. లే అవుట్లో 10 మీటర్ల బ్రిడ్జి నిర్మాణ పనులకు డిజైన్ ఫైనల్ చేయాలని ఆదేశించారు. పనులు పూర్తి చేయడానికి స్పష్టమైన గడువు నిర్దేశించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్, ఇరిగేషన్ డీఈఈ రమేశ్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.