సత్తుపల్లి, జూన్ 28 : ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీలలో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శనివారం తనిఖీ చేసిన కలెక్టర్.. స్కానింగ్ రూం, జనరల్ ఓపీ, డ్రెస్సింగ్, ఇంజక్షన్, ఎక్స్రే రూంలు, డెంటర్ విభాగం, ఫార్మసీ, డయాలసిస్ వార్డులను కలియతిరుగుతూ పరిశీలించారు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్, ఎన్సీడీ సర్వేపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
సాధారణ ప్రసవాలు ఎక్కువగా చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్య సిబ్బందికి సూచించారు. పిల్లల వైద్యులు ఉన్నారా? ఏయే విభాగాలకు వైద్యుల అవసరం ఉంది.. అని అడిగి తెలుసుకున్నారు. స్కానింగ్, ఎక్స్రే విభాగాల్లో టెక్నీషియన్లు ఉన్నారా? సిబ్బంది అవసరమా? అని అడిగారు. కొత్త భవనానికి తగ్గట్లుగా పారిశుధ్య సిబ్బందిని మరింత మందిని నియమించుకోవాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని, అప్పుడే తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.
డయాలసిస్ విభాగం ద్వారా నిత్యం 20 మందికి డయాలసిస్ చేపడుతున్నామని, ఏరియా ఆసుపత్రి పరిధిలో 41 మంది రోగులు డయాలసిస్ కోసం నమోదయ్యారని వైద్యులు వివరించారు. అనంతరం రూ.34 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన ఆసుపత్రి భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. రూ.25 కోట్లతో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కొత్తూరులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట డీసీహెచ్వో డాక్టర్ రాజశేఖర్, ఆర్డీవో ఎల్.రాజేంద్రగౌడ్, వైద్యశాఖ ఈఈ ఉమామహేశ్వరరావు, సత్తుపల్లి ఆసుపత్రి సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు ఉన్నారు.