భద్రాద్రి కొత్తగూడెం, మే 6 (నమస్తే తెలంగాణ) : రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల రైతుల వారోత్సవంలో భాగంగా విత్తనాలు, ఎరువుల డీలర్లకు అవగాహన, వానకాలం సీజన్‌కు సంబంధించిన ఎరువుల సన్నద్ధతపై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశం బుధవారం ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఎస్పీ రోహిత్‌రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సంబంధిత శాఖల అధికారులు, విత్తనాలు, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 6,59,743 ఎకరాల్లో సాగు కొనసాగుతోందని, ఇందులో సుమారు 2.25 లక్షల ఎకరాల్లో పత్తి, లక్ష ఎకరాల్లో మొక్కజొన్న, 1.75 లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగవుతున్నాయని వివరించారు. గత సంవత్సరం జిల్లాలో అధిక దిగుబడులు సాధించామని, ఈ వానకాలంలో కూడా అదేస్థాయిలో ఉత్పత్తి లక్ష్యంగా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ విత్తనాలు, ఎరువుల సరఫరా ఎంతో సున్నితమైన అంశమని, డీలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి కొరత రాకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు, విత్తనాలు, ఎరువుల డీలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.