దమ్మపేట రూరల్, ఏప్రిల్ 1 : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ అంకిత్ హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, గురుకుల పాఠశాలలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత తహసీల్‌లో తహసీల్దార్‌ను కలిసేందుకు వేచి ఉన్న దరఖాస్తుదారులతో కలెక్టర్ మాట్లాడారు.
ఏ పని కోసం వచ్చారు? ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్ఐ, జీపీవోలు, ఎల్డీసీ, యూడీసీతోపాటు ఇతర సిబ్బంది విధులు నిర్వర్తించే గదులు, ఫైళ్లు, రికార్డు రూం, రిజిస్ట్రేషన్లు చేసే కంప్యూటర్ గదిని పరిశీలించారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల పనులను వెంటనే పూర్తి చేయాలని తహసీల్దార్ రామ్‌నరేశ్, ఆర్ఐలు భిక్షమయ్య, వీరస్వామిలను ఆదేశించారు. తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు గురించి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఏర్పడిందని హౌసింగ్ ఏఈ రాము, ఎస్సై సాయికిశోర్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. వివిధ శాఖల అధికారులతో చర్చించి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గిరిజన బాలుర, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను కలెక్టర్ సందర్శించి భోజనాన్ని రుచి చూశారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని ఆయా ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.