టేకులపల్లి, ఏప్రిల్ 20 : ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. గోల్యాతండా పంచాయతీ పరిధిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల, బద్దతుండా ఏకలవ్య పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్వో ప్లాంట్ను పరిశీలించిన ఆయన.. అది ఎప్పుడు ఏర్పాటు చేశారు? రెండేళ్లుగా ఎందుకు వినియోగంలో లేదనే అంశంపై అధికారులను ప్రశ్నించారు.
త్రీఫేస్ విద్యుత్ సమస్యను పరిష్కరించి, ఆర్వో ప్లాంట్ వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. పాఠశాలలో వంట గదులు, సామగ్రి, పరిసరాల పరిశుభ్రత, భోజనం నాణ్యతపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో స్వయంగా మాట్లాడి.. వారికి అందుతున్న సదుపాయాలు, భోజన నాణ్యత వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పఠనా సామర్థ్యం పెంపొందించాలని, బోధనా నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేకాధికారి శ్రీరామ్, తహసీల్దార్ వీరభద్రం, ఏవో అన్నపూర్ణ, ఏంపీవో గాంధీ, సర్పంచ్లు లకావత్ నాకానాయక్, బానోత్ నరేశ్ తదితరులు ఉన్నారు.