ఇల్లెందు రూరల్, జూలై 6 : సింగరేణి బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని, బ్లాక్లన్నీంటినీ సింగరేణి సంస్థకే అప్పగించాలని భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాక్ వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ జాఫర్ హుస్సేన్‌తో కలిసి స్థానిక జీఎం కార్యాలయం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వడమే పనిగా పెట్టుకున్నదని, అలా కాకుండా బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని అడ్డుకునే చర్యలు చేపట్టాలన్నారు.
ఆ దిశగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపట్టాలన్నారు. వేలాన్ని అడ్డుకోవాల్సిన ఇద్దరు తెలంగాణవాసులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు వేలంలో పాల్గొనడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతామని, వేలాన్ని వెంటనే రద్దు చేసి బొగ్గు బ్లాక్‌లను సింగరేణి సంస్థకే అప్పగించాలని, సంస్థ మనుగడ కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సిలివేరి సత్యనారాయణ, కృష్ణయ్య, లలిత, శారద, అబ్దుల్ నబి, వాసు, మునిగంటి శివ, గిన్నారపు రాజేశ్, హరికృష్ణ, రవితేజ, రవి, వసంతరావు, శ్రీను, రాజేశ్, హరిప్రసాద్‌యాదవ్, చాంద్‌పాషా, నిఖిల్, లలిత్ పాసి, రాజశేఖర్, రాంలాల్ పాసి, శ్రీను, మల్సూర్, ప్రేమ్‌కుమార్, రమేశ్, శంకర్, బాలు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటీకరణను అడ్డుకుంటేనే సంస్థ మనుగడ
బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణను అడ్డుకుంటేనే సింగరేణి సంస్థకు మనుగడ ఉంటుందని, కోల్‌బెల్ట్ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీపీఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, నరాటి ప్రసాద్‌లు అన్నారు. తెలంగాణలోని శ్రావణపల్లి బ్లాక్‌తోపాటు ఇతర బొగ్గు బ్లాక్‌లను వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వారం రోజులపాటు చేపట్టనున్న రిలే నిరాహార దీక్షలను కొత్తగూడెంలో శనివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ సంపదను కుబేరుల చేతిలో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోందని, ఇది పరోక్షంగా ఆర్థిక నేరానికి పాల్పడటమే అవుతుందన్నారు. ప్రజలకు చెందాల్సిన బొగ్గు నిక్షేపాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడతామంటే చూస్తూ ఊరుకోబోమని, ప్రజా ఉద్యమాలతో మోదీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో దమ్మాలపాటి శేషయ్య, వంగా వెంకట్, వీరస్వామి, మల్లికార్జున్‌రావు, ఎస్వీ రమణమూర్తి, గట్టయ్య, రాము, క్రిష్టఫర్, సందెబోయిన శ్రీనివాస్, నాగేశ్వరరావు, చంద్రయ్య, బండారు మల్లయ్య, నాగయ్య, భూక్యా దస్రు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ధర్నా
బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ మాట్లాడుతూ తెలంగాణలోని బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి నామినేటెడ్ పద్ధతిలో కేటాయించకుండా.. టెండర్లు పిలవడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వత్తాసు పలకుతోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని వెంటనే విరమించుకోవాలని, లేదంటే కార్మికులు, ప్రజలు నిరసన బాట పట్టక తప్పదన్నారు. సుమారు 37 వేల కోట్ల టర్నోవర్‌తో 3 వేల కోట్లకు పైగా లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థకు బ్లాక్‌లను అప్పజెప్పకుండా ప్రైవేట్ సంస్థలకు అప్పజెబితే ఊరుకోమన్నారు. అనంతరం జీఎం పర్సనల్‌కు వినతిప్రతం అందించారు. కార్యక్రమంలో గడప రాజయ్య, తుమ్మ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, దామోదర్, కాగితపు విజయ్‌కుమార్, రవికుమార్, అవునూరి సంజీవరావు, ప్రసాద్, అశోక్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.