కొత్తగూడెం సింగరేణి, నవంబర్ 16: సింగరేణి సంస్థలో అమలుచేస్తున్న ప్రమాద బీమా పథకం దేశానికే ఆదర్శమని, సింగరేణి బాటలో పలు రాష్ర్టాల్లో ప్రమాదబీమా పథకం అమలు జరుగుతోందని సంస్థ సీఎండీ బలరాం పేర్కొన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఇటీవల ప్రమాదంలో మృతిచెందిన మహ్మద్ అబ్దుల్ అజీం సతీమణికి రూ.కోటి చెక్కు, బట్టు రాజేశ్వరరావు సతీమణికి రూ.40 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ దేశంలో ఏ ఇతర రాష్ర్టాలు, ప్రభుత్వ సంస్థల్లో లేనివిధంగా సింగరేణి సంస్థ తొలిసారిగా బ్యాంకులతో చర్చించి గరిష్ఠంగా రూ.1.25 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
దీనివల్ల కార్మికుల కుటుంబీకులకు ఆర్థికంగా గట్టి భరోసా లభిస్తోందని చెప్పారు. సింగరేణిలో అమలవుతున్న ఈ పథకాన్ని చూసి అసోం, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాలతోపాటు కోలిండియాలో కూడా అమలులోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. అనంతరం సీఎస్ఆర్ కింద మనబ్ కల్యాణ్ వెల్ఫేర్ సొసైటీ త్రిపుర సహకారంతో కొత్తగూడెం ఏరియాలో ప్రాజెక్టు ప్రభావిత మహిళలకు తేనెటీగల పెంపకంలో సమగ్ర శిక్షణ ఇచ్చి తేనెటీగల బాక్సులను, వాటికి సంబంధించిన కిట్లను, మహిళలు తొలిసారిగా సేకరించిన తేనెను సీఎండీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జీఎం శాలెంరాజు, జీఎం పర్సనల్ కిరణ్కుమార్, జీఎం ఆర్సీ ఏజేఎం మురళీధర్, గుర్తింపు సంఘం నుంచి గట్టయ్య, ఐఎన్టీయూసీ నుంచి రజాక్ పాల్గొన్నారు.