కొత్తగూడెం సింగరేణి, జూన్ 2: ఇతర రాష్ర్టాల్లో బొగ్గు బ్లాకులతోపాటు ఇతర ఖనిజ గనులను సాధించుకొని జాతీయస్థాయిలో సింగరేణి సంస్థ ఎదుగుతోందని సంస్థ సీఎండీ బలరాం అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం తెలంగాణ రన్‌ను ప్రారంభించి అమరవీరులకు నివాళులర్పించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎస్అండ్పీసీల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి సీఎండీ బలరాం మాట్లాడుతూ 136 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో, 39 భూగర్భ గనులు 41 వేల మంది కార్మికులతో ఏడాదికి సుమారు 700లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును అందిస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంతోపాటు ఒడిశా రాష్ట్రంలో కూడా ఏడాదికి మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసే గనిని ఈ ఏడాది ప్రారంభించుకోవడం సింగరేణి సంస్థకు చారిత్రాత్మక ఘట్టమన్నారు. దీంతో దేశంలోని ఇతర రాష్ర్టాల్లో కూడా బొగ్గు ఉత్పత్తిలో అడుగుపెట్టి సింగరేణి సంస్థ జాతీయస్థాయిలో స్థానాన్ని దక్కించుకుందన్నారు.
ప్రస్తుతం పోటీ మార్కెట్లో నిలబడాలంటే కనీసం టన్నుకు వెయ్యి రూపాయల ఉత్పత్తి ఖర్చును తగ్గించుకోవాలన్నారు. పనివేళలను పూర్తిగా మార్చుకోవాలని, షిప్టు సమయం 8 గంటలు పూర్తిగా పనిచేయడంతోపాటు మనం వాడే యంత్రాలతో కూడా పని చేయించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జీఎం వెల్ఫేర్ కిరణ్‌కుమార్ అధ్యక్షత వహించగా డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, గుర్తింపు సంఘం నుంచి రాజ్‌కుమార్, ప్రాతినిధ్య సంఘం నుంచి పీతాంబరరావు, సీఎంవోఏఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్‌కుమార్, కార్పొరేట్ పరిధిలోని వివిధ శాఖల జీఎంలు, వివిధ శాఖల అధిపతులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.