హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వైరా, మధిర నియోజకవర్గాల నుంచి బుధవారం సచివాలయానికి తరలివచ్చిన మహాత్మా జ్యోతిబా ఫూలే, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని స్పష్టంచేశారు.
చదువుతోపాటు స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఈ నెల 14న 15 వేల మంది విద్యార్థులతో సమావేశం అవుతానని చెప్పారు. అదేరోజు ఫేజ్-2 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్లను మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు బలరాంనాయక్, రఘురాంరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.