ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 24: సర్కారు పాఠశాలలు కార్పొరేట్ కళను సంతరించుకున్నాయని మంత్రి అజయ్‌కమార్ పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారని అన్నారు. ‘మన ఊరు మన బడి’ కింద ఖమ్మంలోని 40వ డివిజన్లో రూ.67.59 లక్షలతో తీర్చిదిద్దిన మోమినాన్ ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను శుక్రవారం ఆయన పునఃప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ విద్యపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించాలని, సర్కారు పాఠశాలలనన్నింటినీ కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని అన్నారు. దీంతో విద్యార్థులందరూ మంచి వాతావరణంలో ఇష్టంగా చదువుకుంటున్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలనూ కల్పించి ప్రతి విద్యార్థినీ ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యతా ప్రమాణాలతో కూడి విద్య అందుతోందని అన్నారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడతూ.. ‘మన ఊరు/ మన బస్తీ – మన బడి’ కార్యక్రమం కింద జిల్లాలో మొదటి విడతగా 426 పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. మేయర్ పునుకోల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్‌సురభి, కార్పొరేటర్ అమృతమ్మ, డీఈవో సోమశేఖరశర్మ, ఈఈ కృష్ణలాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్.. పాఠశాల గోడలపై ఏర్పాటు చేసిన చిత్రాలను గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు.
జడ్పీలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ
మామిళ్లగూడెం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పాలన అందిస్తున్నారని అన్నారు. ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అందిస్తున్న పాలన నేడు దేశానికి దిక్సూచిగా మారిందని స్పష్టం చేశారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, కలెక్టర్ గౌతమ్, సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, మేయర్ పునుకొల్లు నీరజ, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్పర్సన్ మరికంటి ధనలక్ష్మి, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.