జూలూరుపాడు, ఆగస్టు 27: బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలే ప్రతి ఒక్కరికీ శిరోధార్యమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలవడం ఒక చరిత్ర అని, ప్రభుత్వ పథకాలకు ఆకర్షితుడినై బీఆర్ఎస్లో చేరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. తనకు టికెట్ కేటాయించకున్నా పార్టీ ఆదేశాల మేరకు ప్రజల్లో ఒకడిగా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
తనకి టికెట్ రాలేదని కార్యకర్తలు, నాయకులు ఎలాంటి నైరాశ్యానికి గురికాకుండా కేసీఆర్ నిర్ణయాన్ని గౌరవిస్తూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మండలంలోని జూలూరుపాడు, పాపకొల్లు, కొమ్ముగూడెం, వెంగన్నపాలెం గ్రామాల్లోని బాధిత కుటుంబాలను పరామర్శించారు. కొమ్ముగూడెం నుంచి వైకుంఠధామం వరకు అర కిలో మీటర్ సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.30లక్షలు మంజూరు కావడంతో రహదారిని పరిశీలించి వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు, ఎంపీపీ లావుడ్యా సోని, జడ్పీటీసీ భూక్యా కళావతి, బీఆర్ఎస్ నాయకులు యల్లంకి సత్యనారాయణ, వేల్పుల నర్సింహారావు, పొన్నెకంటి సతీష్‌కుమార్, చౌడం నర్సింహారావు, నున్నా రంగారావు, యదళ్లపల్లి వీరభద్రం, రామిశెట్టి నాగేశ్వరరావు, మోదుగు రామకృష్ణ, రామిశెట్టి రాంబాబు, చేపలమడుగు రామ్మూర్తి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.