నాడు తెలంగాణోద్యమం ఉధృతంగా.. ఉవ్వెత్తున ఎగసిపడేందుకు.. కఠోర దీక్షాదక్షతకు కారణమైన ఖమ్మం జిల్లా గడ్డకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం రానున్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జీళ్లచెరువులో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. జిల్లాలోనే తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభ కావడం.. పోరుబిడ్డ, సీఎం కేసీఆర్ హాజరవుతుండడంతో స్వాగతం పలికేందుకు నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జనసమీకరణపై దృష్టి సారించిన పాలేరు ఎమ్మెల్యే, అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్.. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే కందాళ.. సీఎం సభకు ప్రజలు, లబ్ధిదారులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్ తొలి సభ నిర్వహిస్తుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కనున్నది.
ఖమ్మం, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జీళ్లచెర్వుకు విచ్చేసి ప్రజాఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, ఎంపీ నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సభాస్థలిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీఆర్ఎస్ శ్రేణులు కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల నుంచి భారీగా జన సమీకరణ చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నాయకులు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ప్రజలు దూరం నుంచి కూడా సభను వీక్షించేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభా వేదిక నుంచి ఉమ్మడి జిల్లా నుంచి పోటీ చేస్తున్న పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. సభాస్థలిలో ఏర్పాట్లను గురువారం ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పరిశీలించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ సభా ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు సూచనలిచ్చారు.