సారపాక/ భద్రాచలం/ సత్తుపల్లి/ వైరా టౌన్, సెప్టెంబర్ 13: ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హైదరాబాద్లోని ప్రగతిభవన్లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందించారు. బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ స్థానాన్ని తనకు కేటాయించడం పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి రేగా.. సీఎంకు కేసీఆర్కు వివరించారు. అలాగే, కరకగూడెం మండలం పులుసుబొంత ప్రాజెక్టు గురించి కూడా సీఎంతో చర్చించారు.
కాగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి జీవో త్వరలో విడుదల చేయనున్నట్లు సీఎం చెప్పినట్లు రేగా తెలిపారు. అలాగే బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు కూడా ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. ఏటా గోదావరి వరదల నేపథ్యంలో మిగిలిన ప్రాంతాల్లో కరకట్ట నిర్మాణం ఆవశ్యతక గురించి సీఎం కేసీఆర్కు తెల్లం వెంకట్రావు వివరించారు. అలాగే, సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన సత్తుపల్లి మండలంలోని మరికొందరు రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా వైరా ఎమ్మెల్యే రాములునాయక్ కూడా సీఎం కేసీఆర్ను కలిసి నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.