మధిర, నవంబర్21: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజాశీర్వాద సభ విజయవంతమైంది. ఈ సభకు బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, చింతకాని, ముదిగొండ మండలాల నుంచి వేలాదిగా ప్రజలే కాక ఆంధ్రా ప్రాంతం నుంచి సీఎం కేసీఆర్ ప్రసంగం వినేందుకు తరలివచ్చారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సభా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలకు, పురుషులకు గ్యాలరీలు, కుర్చీలను ఏర్పాటు చేశారు. ఈ సభలో గాయకురాలు మధుప్రియ, కళా బృందాల సభ్యులు గేయాలు ఆలపిస్తూ సభకు వచ్చిన వారిని పాటలతో అలరించారు. సీపీ విష్ణు ఎస్ వారియర్ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు. మధిర పట్టణం నలువైపులా గులాబీ జెండాలతో రోడ్లన్నీ నిండిపోయాయి. ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వలంటీర్లను ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీటిని సరఫరా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు తనయురాలు అభిజ్ఞ తన తండ్రికి ఓటు వేసి ఎన్నికల్లో గెలిపించాలని మాట్లాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నా పేరు నామా సింధు. మాది ఖమ్మం జిల్లా కల్లూరు గ్రామం. నాకు మధిర యువకుడితో సంవత్సరం క్రితం వివాహమైంది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి ద్వారా రూ.1,00,116 అందాయి. నా తల్లిదండ్రులు పెళ్లి నిమిత్తం తెచ్చిన అప్పును ఆ డబ్బులతో తీర్చి తలభారం దించుకున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే నాలాంటి ఆడపిల్లలందరికి పెద్దన్నగా ఉంటాడు.
ఏడుపదుల వయస్సులో కూడా సీఎం కేసీఆర్ ప్రజాశీర్వాద సభకు ఎండలో వస్తుండడం చూసిన నమస్తేతెలంగాణ ప్రతినిధి అతనిని మందలించగా ముఖ్యమంత్రి కేసీఆర్ నా పెద్దకొడుకు అని సమాధానం చెప్పాడు. ఎందుకు అని అడగగా నాకు ఆసరా పెన్షన్ ప్రతినెలా రూ.2016 ఇస్తున్నాడని సమాధానం చెప్పాడు. సీఎం కేసీఆర్ నాకు ప్రతి నెలా పింఛన్ ఇస్తున్నాడు. కాబట్టి సీఎం కేసీఆర్ నా పెద్దకొడుకు లెక్క..
తెలంగాణ ప్రజలు అదృష్టం చేసుకోవడం వల్ల కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయి మూడోసారి గెలవడానికి సిద్ధంగా ఉన్నాడని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం, ఖమ్మంపాడు గ్రామానికి చెందిన అభిమాని కలగాని వెంకటేశ్వర్లు అన్నారు. రైతు ప్రయోజనకరమైన పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆరే.
ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రజకుల లాండ్రీ షాపులకు, దోబీగాట్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ను ఇస్తుండు. ఇంతకు ముందు అరకొర ఆదాయంతో బతుకుతున్నం ఇప్పుడు రోజు వచ్చే సంపాదనలో కొంతమేర పొదుపు చేసుకుంటున్నాం.