దారులన్నీ బొగ్గుట్ట బాటపట్టాయి. నలుదిక్కులా గులాబీ శ్రేణులే దర్శనమిచ్చాయి. మదినిండా అభిమానంతో లక్షలాదిగా జనం తరలిరావడంతో సభా ప్రాంగణం నిండిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో బుధవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సీఎం కేసీఆర్ ప్రసంగం కొనసాగుతున్నంతసేపు ఓపికగా విన్న ప్రజలు ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. ఉమ్మడి పాలనలో అన్ని రంగాల్లో వెనుకబడిపోయిన నియోజకవర్గాన్ని ఇంతగా అభివృద్ధి చేసిన విద్యావంతురాలు, బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియకు ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు. సభకు హాజరైన జనం జై కేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేయడంతో సభా ప్రాంగణం హోరెత్తింది.