‘పోడు పట్టాతో గిరిజనులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌కు గిరిజనులంతా రుణపడి ఉండాలి. పట్టా పొందిన అందరికీ వారం రోజుల్లోనే పెట్టుబడి సాయం అందుతుంది. ఇక సంబురంగా సాగు చేసుకోవాలి’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రఘునాథపాలెం మండలానికి చెందిన 673 మంది గిరిజన రైతులకు రఘునాథపాలెం రైతు వేదికలో గురువారం మంత్రి పోడు పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు. పోడు సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన సీఎం కేసీఆర్ రుణాన్ని వచ్చే ఎన్నికల్లో తీర్చుకోవాలని కోరారు.
-రఘునాథపాలెం, జూలై 6
కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
పోడు పట్టాలిచ్చి సీఎం కేసీఆర్ సారు మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నడు. గతంలో మేం అధికారుల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నేడు పట్టాలు ఇవ్వడంతో మాకు ధైర్యం వచ్చింది. ఇక నుంచి నిర్భయంగా వ్యవసాయం చేసుకుంటాం. కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– పొడియం వెంకటేశ్వర్లు, పోడు రైతు, లక్ష్మీపురం, బూర్గంపహాడ్ మండలం
రఘునాథపాలెం, జూలై 6: ఒక్క పట్టాదారు పాస్ బుక్‌తో అనేక ప్రయోజనాలు లభించనున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, వ్యవసాయ బోర్లు, రాయితీ విత్తనాలు, ఎరువులు, బ్యాంకుల్లో పంట రుణాల వంటి ఎన్నో సదుపాయాలను పొందవచ్చునని అన్నారు. వీటితోపాటు పోడు భూములపై సర్వహక్కులు గిరిజన రైతులకే ఉంటాయని స్పష్టం చేశారు. రఘునాథపాలెం మండలానికి చెందిన 673 మంది గిరిజన రైతులకు రఘునాథపాలెం రైతువేదికలో గురువారం పోడు పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు. తాను మంత్రిగా ఉన్న మండలంలోని 673 మంది గిరిజన రైతులకు 17 వేల పైచిలుకు ఎకరాలపై హక్కులు కల్పించిన పోడు పట్టాలను అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. అంతేగాక పట్టా పొందిన రైతులందరికీ రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తిస్తాయన్నారు. వారం రోజుల్లోనే వారికి రైతుబంధు సాయం అందుతుందని అన్నారు. అలాగే భూమి పట్టాలను కలిగి ఉన్న రైతులకు నామినేటెడ్ పదవుల్లోనూ అవకాశాలు లభిస్తుంటాయని అన్నారు. ఒక్క పట్టాదారు పాసుపుస్తకంతో ఇన్ని ప్రయోజనాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఆదివాసీ, గిరిజన రైతులు ఎప్పటికీ రుణపడి ఉండాలని ఆకాంక్షించారు.
‘ధరణి’తోనే భరోసా..
‘ధరణి’ని బంగాళాఖాతంలో వేస్తామంటూ వెకిలి కూతలు కూసే నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి సూచించారు. ధరణి పోర్టల్‌తోనే రైతులందరికీ భరోసా ఏర్పడిందని, పోడు భూముల వివరాలనూ ధరణిలో చేర్చిందని, దీంతో ఆ భూముల వివరాలన్నీ అందులో శాశ్వతంగా ఉండిపోతాయని, భవిష్యత్తులో రైతుల వారసులు సులభంగా ఆ భూములకు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
చిల్లరగాళ్ల మాటలకు మోసపోవద్దు..
ఎన్నికల సమయంలో వచ్చే చిల్లరగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి అజయ్ సూచించారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అందాలంటే సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏళ్లకేళ్లుగా పోడు సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన సీఎం కేసీఆర్ రుణాన్ని వచ్చే ఎన్నికల్లో తీర్చుకోవాలని సూచించారు. అనంతరం పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు భుక్యా గౌరి, గుత్తా రవి, మద్దినేని వెంకటరమణ, అజ్మీరా వీరూనాయక్, మందడపు నర్సింహారావు, మందడపు సుధాకర్, గుడిపూడి రామారావు, రామారావు, బండి వెంకన్న, రామకృష్ణ, రాధిక పాల్గొన్నారు.