భద్రాచలం, జూన్ 25: తెలంగాణ రాష్ట సాధనతోనే ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని, సీఎం కేసీఆర్ నష్ర్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు వచ్చారని నిజామాబాద్ ఎమ్మెల్యే, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆదివారం భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న అనంతరం ఆయన భద్రాచలం ఆర్టీసీ బస్ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డిపో ఆవరణలో హరిత తెలంగాణ కార్యక్రమంలో భాగంగా మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలనే సంకల్పంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నారని, ఆనాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై ఎంతో మందికి నీడను ఇస్తున్నాయని అన్నారు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా ఉండాలంటే మొక్కలు నాటడమే మార్గమని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు కేఎంపీఎల్ పెంచి ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వాలు ఆర్టీసీని పట్టించుకోలేదని, వారి విధానాలతోనే ఆర్టీసీకి నష్టాలు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ మంచి స్థితిలోనే ఉందని, కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం భవానీ ప్రసాద్, కొత్తగూడెం డిపో మేనేజర్ బీ వెంకటేశ్వరరావు, భద్రాచలం డీఎం రామారావు, ఖమ్మం ఆర్టీసీ సీఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పర్ణశాల రామయ్యను దర్శించుకున్న ఆర్టీసీ చైర్మన్
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పర్ణశాల రామయ్యను దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పంచవటి నార చీరెల ప్రాంతాన్ని దర్శించుకొని ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది, దుమ్ముగూడెం ఎస్సై కేశవ్, పోలీస్ సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.