కూసుమంచి, అక్టోబర్ 26 : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సుమారు ఆరేళ్ల తర్వాత పాలేరు నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. 27 జనవరి 2017న భక్తరామదాస్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ జీళ్లచెర్వులో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. సభాస్థలం సుమారు 30 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఎంపీ నామా నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో చకచకా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం నుంచే మొదలు కావడం విశేషం. బీఆర్ఎస్ శ్రేణులు సభను విజయవంతం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశాయి. కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలాల్లోని ప్రతి గ్రామం నుంచి భారీగా ప్రజలు సభకు తరలిరానున్నారు.
కూసుమంచి వైపు నుంచి వచ్చే వారు సభాస్థలం ఎదురుగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ఎల్వీ వెంచర్, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల నుంచి వచ్చే వాహనాలు తల్లంపాడుకు వెళ్లే దారి పక్కన ఖాళీస్థలంలో వాహనాలు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. సభా స్థలానికి 300 మీటర్ల దూరంలోనే హెలీప్యాడ్ ఏర్పాటైంది. అక్కడి నుంచి సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్ దిగి సరాసరి సభా స్థలానికి వచ్చే విధంగా అధికారులు రోడ్డు వేయించారు.
బహిరంగ సభకు భారీగా జనం విచ్చేసే అవకాశం ఉన్నందున పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సీపీ విష్ణు ఎస్ వారియర్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బందోబస్తులో సుమారు 400 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటారు. ఏసీపీలు బస్వారెడ్డి, గణేశ్, సారంగపాణి, సీఐలు జితేందర్‌రెడ్డి, రాజిరెడ్డి బందోబస్తును పర్యవేక్షిస్తారు.