సర్కారు స్కూళ్లలో చదివే పేద విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పల్లెల్లో తల్లిదండ్రులు ఉదయమే వ్యవసాయ, కూలీ పనులకు.. పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు ఉద్యోగాలకు వెళ్లే తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఇంటి వద్ద అల్పాహారం లేకుండానే ఖాళీ కడుపుతో పుస్తకాలు చేతపట్టుకొని పాఠశాలలకు వెళ్లడం నిత్యకృత్యం. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటూ ఆకలితో నకనకలాడుతూ మధ్యాహ్న భోజనం కోసం వేచి చూడాల్సి వస్తోంది. ‘ఇక విద్యార్థులు ఖాళీ కడుపుతో ఇబ్బంది పడొద్దు.. వారి కడుపు నిండితేనే టీచర్లు బోధించే పాఠాలు బుర్రకెక్కేది. చదువుల్లో ముందుకెళ్లేది’ ఇందుకోసం సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన టేస్టీ టిఫిన్ ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పథకం. ఎదిగే పిల్లలకు ఉదయం ఇంట్లో మాదిరిగా రుచికరమైన అల్పాహారం, మధ్యాహ్నం సన్నం బియ్యంతో భోజనం అందిస్తూ వారికి చదువుపై ఆసక్తి కలిగే విధంగా చేశారు సీఎం కేసీఆర్. ఉమ్మడి జిల్లాలో ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పథకం శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, లావుడ్యా రాములునాయక్, బానోత్ హరిప్రియానాయక్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు తమ తమ నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించారు. పిల్లలతో కలిసి టిఫిన్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పథకం ఉమ్మడి జిల్లాలో శుక్రవారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. తొలుత ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించి కార్యక్రమాన్ని మంత్రి, ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. దసరా పండుగ నుంచి ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది.
ఖమ్మం, అక్టోబర్ 6 : ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం నగరంలోని రోటరీనగర్ ఉన్నత పాఠశాలలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి ‘సీఎం బ్రేక్’ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోనూ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించాలంటే వెనుకడుగు వేసేవారన్నారు. ఆ పరిస్థితికి చరమ గీతం పాడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’ ద్వారా మెరుగైన వసతులు కల్పిస్తున్నారని కొనియాడారు.
ఇప్పటికే మధ్యాహ్న భోజనం అందిస్తున్న ప్రభుత్వం ఇక నుంచి పోషకాలతో కూడిన అల్పాహారాన్నీ అందించనున్నదన్నారు. తర్వాత అనేక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. వ్యక్తులు, పార్టీలు, కులాలకు అతీతంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. ఖమ్మం నగరాన్ని ఐదేళ్లలో రూ.3 వేల కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌తో పోటీపడేలా నగరాన్ని తీర్చిదిద్దామన్నారు. అనంతరం నగరంలోని పోలియో హోంలో శ్రీమిత్ర ఫౌండేషన్, ఎన్ఆర్ఐలు సమకూర్చిన కుట్టుమిషన్లను నగరానికి చెందిన పలువురు మహిళలకు అందించారు. కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
వైరాటౌన్, అక్టోబర్ 6 : విద్యార్థుల ఎదుగుదలకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ద్వారా అందించే పౌష్ఠికాహారం ఎంతో ఉపయోగపడుతుందని, ఇది పేద విద్యార్థులకు వరం లాంటిదని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. వైరాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పనిచేస్తున్నాయని, ఇందుకోసం సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నదన్నారు. పేద విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఎదిగేందుకు సీఎం అల్పాహార పథకం దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు, దుస్తులు అందిస్తున్నదని, మధ్యాహ్నం భోజనం సన్న బియ్యంతో అందిస్తున్నదని గుర్తు చేశారు. సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ద్వారా డ్రాపౌట్స్‌ను తగ్గించవచ్చని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, తహసీల్దార్ కేవీ శ్రీనివాస్, ఎంపీడీవో కరుణాకర్‌రెడ్డి, ఎంఈవో కొత్తపల్లి వెంకటేశ్వర్లు, హెచ్ఎం నాగబత్తిని భాస్కర్, మార్కెట్ మాజీ చైర్మన్ బిడికె రత్నం, కోఆప్షన్ సభ్యులు బీబాసాహెబ్, కర్నాటి హనుమంతరావు పాల్గొన్నారు.
మధిరటౌన్, అక్టోబర్ 6 : సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అల్పాహార పథకం పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు వరం లాంటిదని, విద్యా వ్యవస్థ బలోపేతానికి ఎంతో దోహదపడుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఖమ్మంపాడు మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సర్పంచ్ దొండపాటి రుక్మిణమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఉదయం పూట ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమన్నారు. ఈ పథకం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందుతుందన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని భుజించారు. అల్పాహారం అందించేందుకు ముందుకొచ్చిన గ్రామవాసి, డీసీసీబీ వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావును జడ్పీ చైర్మన్ కమల్‌రాజు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, డీసీసీబీ వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, ఎంపీపీ మెండెం లలిత, వైస్ ఎంపీపీ సామినేని సురేశ్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో సిలార్ సాహెబ్, ఎంఈవో వై.ప్రభాకర్, సెక్టోరియల్ ఆఫీసర్ సీహెచ్.రామకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 6 : తరగతి గదిలో విద్యార్థులకు ఆకలి నివారించడం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు సీఎం అల్పాహార పథకం ఎంతో ఉపయోగపడుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలం ఇందిరానగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ ప్రియాంకతో కలిసి ఎమ్మెల్యే అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు బంగారు భవిష్యత్‌ను ప్రసాదించేది విద్యాలయమని, పేద కుటుంబాల విద్యార్థులకు ఈ పథకం వరమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం ద్వారా అల్పాహారం అందించనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఉదయం రాగి జావ, అల్పాహారం, మధ్యాహ్నం పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నామని, దేశంలో ఏరాష్ట్రం అమలు చేయని ఈ పథకాలు మన ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్, ఇంజినీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు లాంటి ఉద్యోగాలు సాధించి ప్రజలకు సేవలందించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు పోషక విలువలున్న ఆహారాన్ని అందించేందుకు సీఎం అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. దసరా సెలవుల అనంతరం జిల్లాలోని 1,387 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వరాచారి, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల, ఎంపీపీ భూక్యా సోనా, సర్పంచ్ పూనెం నాగేశ్వరరావు, వెల్ఫేర్ ఆఫీసర్ విజేత, సీఎం అల్పాహార ప్రత్యేక అధికారి స్వర్ణలత లెనీనా, ఉప సర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ కొల్లు పద్మ, ఎస్ఎంసీ చైర్మన్ చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్, అక్టోబర్ 6 : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు వరం లాంటిదని, దీంతో పేద విద్యార్థులకు పౌష్ఠికాహారం అందుతుందని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని జలగం నగర్ పాఠశాలలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ఎమ్మెల్యే కందాళ, కలెక్టర్ వీపీ గౌతమ్‌లు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం ఎంఈవో మోదుగు శ్యాంసన్‌కు కలెక్టర్ పలు సూచనలు చేశారు. నేటి నుంచి విధిగా పాఠశాలల్లో అల్పాహారం పథకం కొనసాగాలన్నారు. ప్రభుత్వం సూచించిన మెనూ ఆధారంగా టిఫిన్లు ఏర్పాటు చేయాలన్నారు. అల్పహారం ఏర్పాటు చేసే గదిలో అవసరమైన కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిరుపేద విద్యార్థులకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తద్వారా సమయానికి పిల్లలు పాఠశాలకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కొద్ది రోజుల్లోనే మిగిలిన పాఠశాలల్లో సైతం అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ పీవీ రామకృష్ణ, ఆర్ఐ క్రాంతి, ఎంపీఓ రాజారావు, పెద్దతండా పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణతోపాటు పలువురు విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి, అక్టోబర్ 6 : తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని పాతసెంటర్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అల్పాహార పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా రూ.10వేల కోట్లు వెచ్చించి తొలి విడతలో పాఠశాలలను పూర్తిస్థాయిలో ఆధునీకరించారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను స్థాపించి పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించడంతోపాటు విద్యార్థులను చదువులో ముందుంచేలా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. విద్యార్థులకు ప్రస్తుతం వడ్డించే మధ్యాహ్న భోజనంతోపాటు రాగిజావ అందిస్తూనే నూతనంగా సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించి శుక్రవారం నుంచి అమలు చేయడం హర్షణీయమన్నారు. వారంలో ఆరు రోజులపాటు విద్యార్థులకు ఆరు రకాల అల్పాహారాన్ని రుచికరంగా తయారు చేయడంతోపాటు నాణ్యతతో వడ్డించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. విద్యార్థులు కూడా ప్రభుత్వం అందించే సౌకర్యాలను వినియోగించుకుని చదువులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ముందుగా ఎమ్మెల్యే విద్యార్థులకు అల్పాహారం వడ్డించి వారితో కలిసి రుచి చూశారు. అనంతరం విద్యార్థుల వద్దకు వెళ్లి అల్పాహారం ఎలా ఉందంటూ.. ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్డీవో అశోక్‌చక్రవర్తి, కమిషనర్ సుజాత, సీడీపీవో కొండమ్మ, ఎంఈవో రాములు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఎంపీపీ దొడ్డా హైమావతి, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, పాఠశాల హెచ్ఎం చిత్తలూరి ప్రసాద్, శైలకుమారి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, మట్టా ప్రసాద్, రఫీ, అంకమరాజు, చాంద్‌పాషా, అమరవరపు విజయనిర్మల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇల్లెందు, అక్టోబర్ 6 : ఎదిగే పిల్లలకు నాణ్యమైన, పోషక విలువలున్న ఆహారం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టారని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 20 వార్డు స్టేషన్ బస్తీలో ఉన్న ఉర్దూ పాఠశాలలో అల్పాహారం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ రోజు విద్యార్థులకు అల్పాహారం అందించడం సంతోషకరమైన విషయమన్నారు. చదువులో బాగా రాణించాలంటే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, ఈ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవడం మంచి పరిణామమన్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రతి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారాన్ని అందిస్తారన్నారు. పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందేలా వారంలో ఆరు రోజులకు ప్రత్యేక మెనూను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. విద్యార్థులు పాఠశాలకు రాగానే బ్రేక్‌ఫాస్ట్ అందజేస్తారన్నారు. పోషకాహారాన్ని విద్యార్థులకు సకాలంలో వడ్డించి వారి ఆరోగ్యాన్ని చూడాల్సిన బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందిపై ఉందన్నారు. భావితరాలు మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు చదువులో ఉత్తీర్ణత సాధించి రాష్ర్టానికి, దేశానికి మంచి పేరు తేవాలన్నారు. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉన్న వసతులు, సౌకర్యాలు, సదుపాయాలు, పోషకాహారాలు కార్పొరేట్ స్కూళ్లలో లభించడం లేదన్నారు. సర్కారు పాఠశాలలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ నవీన్, మేనేజర్ అంకుషావలి, కౌన్సిలర్లు మొగిలి లక్ష్మి, కటకం పద్మావతి, కమిటీ సభ్యులు సూర్యనారాయణ, ఈశ్వర్, శ్రీను, ఖాజా, తాహెర్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట, అక్టోబర్ 6 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, ఇందులో భాగమే సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకమని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. స్థానిక బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యార్థులకు అల్పాహారం అందించారు. అనంతరం ప్రభుత్వం ఉచితంగా మంజూరు చేసిన సైకిళ్లను బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచే విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ పిల్లలందరికీ ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతో బడి బయట పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించే విధంగా కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం రాగి జావ ఇవ్వడమే కాకుండా సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, వర్క్, నోట్ బుక్స్ అందిస్తుందన్నారు. తాజాగా సీఎం బ్రేక్‌ఫాస్ట్‌తో బలవర్థకమైన ఆహారం అందించేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ‘ఉన్నతి’, ‘లక్ష్య’ వంటి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. అల్పాహారం తిన్న విద్యార్థులు, సైకిళ్లు అందుకున్న విద్యార్థినులు థాంక్యూ సీఎం సార్.. థాంక్యూ ఎమ్మెల్యే సార్.. అంటూ ఆనందంతో నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి, డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఎంపీడీవో జి.శ్రీనివాసరావు, ఎంఈవో పి.కృష్ణయ్య, సీడీపీవో రోజారాణి, ఎస్ఎంసీ చైర్మన్ షమీమా బేగం, బీఆర్ఎస్ నాయకులు యూఎస్ ప్రకాశ్‌రావు, సత్యవరపు సంపూర్ణ, మందపాటి రాజమోహన్‌రెడ్డి, తాడేపల్లి రవి, చిప్పనపల్లి బజారయ్య, చందా కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
అల్పహారం పథకం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు నా తరఫున , మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతున్నా. నాలాంటి ఎంతో మంది పేద పిల్లలకు ఈ పథకం మంచిగా ఉపయోగపడుతుంది. తొలివిడతో మా పాఠశాలకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కందాళకు కూడా కృతజ్ఞతలు. మంచి విద్యను, అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోం.
-వెన్నెల, 9వ తరగతి జలగం నగర్, ఖమ్మం రూరల్
ఈరోజు మా పాఠశాలలో పండుగ వాతావరణం కనిపించింది. అందరం రోజుకంటే మందుగానే బడికి వచ్చాం. కొద్ది సేపటికే పాఠశాలలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభమైంది. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, కలెక్టర్ గౌతమ్ సార్లు వచ్చారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందజేయడం ఎంతో సంతోషంగా ఉంది. మా కోసం ఈ ఆలోచన చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-ఉషశ్రీ, 9వ తరగతి జలగం నగర్, ఖమ్మం రూరల్
కలెక్టర్, ఎమ్మెల్యేతో కలిసి ఈరోజు ఉదయం టిఫిన్ చేశాను. చాలా సంతోషంగా ఉంది. మూడు రకాల టిఫిన్లు పెట్టారు ఎంతో రుచిగా ఉన్నాయి. రేపటి నుంచి ఇంటి వద్ద భోజనం, టిఫిన్ చేయాల్సిన అవసరం లేదు. పొద్దుగాల తయారై రావొచ్చు. మధ్యాహ్నం కూడా ఇక్కడే భోజనం ఉంటుంది. మా టీచర్లు దగ్గరుండి టిఫన్ పెట్టించారు. సీఎం కేసీఆర్ సార్‌కు థ్యాంక్స్ చెబుతున్నా.
-దీక్ష, 7వ తరగతి జలగం నగర్, ఖమ్మం రూరల్
ఇంటి దగ్గర వంట అయ్యే సరికి అప్పుడప్పుడు ఆలస్యంగా బడికి వెళ్లాల్సి వస్తోంది. కానీ.. ఈరోజు నుంచి ఉదయం టిఫిన్ పాఠశాలలో పెడతారని సార్లు చెప్పారు. ఇక నుంచి పొద్దుగాల బడికి వెళ్లొచ్చు. ఇక్కడే టిఫిన్ ఉంటుంది కాబట్టి అందరికి సంతోషంగా ఉంది. భోజనం చేయడానికి కొత్త ఆఫీస్, కుర్చీలు ఏర్పాటు చేశారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టూ సీఎం కేసీఆర్ సార్.
-సాయితేజ, 9వ తరగతి జలగం నగర్, ఖమ్మం రూరల్