భద్రాద్రి కొత్తగూడెం, జూలై 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో చాలామంది ఉదయాన్నే స్కూలుకు వచ్చే సమయంలో ఇంట్లో అల్పాహారం ఏమీ తినకుండానే బయలుదేరుతున్నారు. టెన్త్ విద్యార్థులైతే ప్రత్యేక తరగతుల కోసం మరికొంతముందుగానే బయలుదేరి వచ్చేవస్తున్నారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు ప్రార్థన సమయంలో కళ్ల తిరిగి కిందపడిపోవడం, మరికొందరు క్లాసుల మధ్యలోనే నీరసించిపోవడం వంటి ఘటనలు జరిగేవి. దీంతో ఉదయం వేళ కూడా విద్యార్థుల ఆకలి తీర్చాలని, రుచికరమైన ఆహారం అందించి వారిని ఇష్టంగా పాఠశాలల రప్పించాలని,
ఫలితంగా హాజరుశాతం కూడా పెరుగుతుందని గత కేసీఆర్ ప్రభుత్వం భావించింది. ఇందుకోసం 2023 అక్టోబర్ 6న అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ పథకానికి శ్రీకారం చుట్టింది. తొలుత ఒక్కో మండలంలో ఒక్కో పాఠశాలను ఎంపిక చేసి ఈ పథకాన్ని అమలు చేసింది. రోజుకో రకం అల్పాహారం చొప్పున రుచికరమైన ఆహారం అందించడంతో విద్యార్థుల నుంచి, వారి తల్లిదండ్రుల నుంచి ఈ పథకాన్ని అనూహ్య స్పందన లభించింది. విశేష ఆదరణ పొందింది. కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఈ పథకానికి మంగళం పాడింది.
అప్పటి వరకూ ఆదరణ పొందిన ఈ పథకాన్ని కొత్త సర్కారు వచ్చీరాగానే అటకెక్కించింది. మండలానికి ఒకటి చొప్పున భద్రాద్రి జిల్లాలోని 23 మండలాల్లో కొనసాగిన ఈ పథకం.. కొత్త సర్కారు పట్టించుకోకపోవంతో మూలనపడింది. అయితే తరువాతైనా సర్కారు బిల్లులు చెల్లిస్తుందేమోననుకొని చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, వంట కార్మికులు సొంత నగదుతో పథకాన్ని నడిపించారు. గత విద్యాసంవత్సరం ముగిసిన ఏప్రిల్ వరకూ దుకాణాల దగ్గర అప్పులు తెచ్చిమరీ విద్యార్థులకు అల్పాహారం అందించారు. కానీ వారి బిల్లుల బకాయిలపై ప్రభుత్వం నోరు మెదపలేదు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో కొత్త ప్రభుత్వమేమీ ఆదేశాలు ఇవ్వకపోవడం, పథకాన్ని కొనసాగించకపోవడం వంటి కారణాలతో పథకం మొత్తానికి నిలిచిపోయింది.
అయినప్పటికీ మరికొందరు ఉపాధ్యాయులు, ఇంకొంతమంది వంట కార్మికులు చొరవ చూపి కొన్ని రోజులపాటు ఉదయం వేళలో విద్యార్థులకు టిఫిన్ అందించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. బిల్లుల చెల్లింపు ప్రస్తావన లేదు. దీంతో వారు కూడా తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీంతో విద్యార్థుల ఆకలి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. చాలామంది విద్యార్థులు ఇప్పటికీ ఖాళీ కడుపులతో పరుగుపరుగున పాఠశాలలకు వస్తున్నారు. ఉన్న పథకాన్ని విస్తరించాల్సిందిపోయి.. కొత్త సర్కారు వచ్చి మొత్తానికి ఎత్తేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త సర్కారు కొలువుదీరిన డిసెంబర్ నెల దగ్గర నుంచి గత విద్యాసంవత్సరం ముగిసిన ఏప్రిల్ నెల వరకూ సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకానికి పైసా విదిల్చలేదు రేవంత్రెడ్డి సర్కారు. దీంతో విద్యార్థులకు అల్పాహారం వండి అందించిన వర్కర్లకు ఇప్పటికీ బిల్లులు అందలేదు. భద్రాద్రి జిల్లాలో ఈ బిల్లుల బకాయి సుమారు రూ.20 లక్షలుగా ఉందని అధికారులు చెబుతున్నారు. అప్పటికే వారు కిరాణా దుకాణాల వద్ద అప్పులు తెచ్చి మరీ అల్పాహారం అందించడం, ఇన్నాళ్లు నగదు చెల్లించకపోవడంతో కిరాణా దుకాణాల యజమానులు వంట కార్మికులను ప్రశ్నిస్తుండడం, వారేమో ఉపాధ్యాయులను వేడుకుంటుండడం, వారేమో సమాధానాలు చెప్పలేకపోతుండడం వంటి ఘటనలు ఆయా పాఠశాలల వద్ద కన్పిస్తున్నాయి. అంతంత పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిలను చెల్లించలేని వంట కార్మికులు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. తమ పిల్లల నోటికాడి అల్పాహారాన్ని ఆపివేశారంటూ విద్యార్థుల తల్లిదండ్రులేమో నిట్టూర్చుతున్నారు.
ఉదయమే ఇంట్లో అమ్మకు చాలా భారం తగ్గేది. టిఫిన్ చెయ్యాలంటే బాగా లేట్ అయ్యేది. స్కూల్లో టిఫిన్ పెడుతున్నారంటే మా అమ్మ చాలా సంతోషపడింది. మేం కూడా త్వరగా స్కూలుకు వచ్చేవాళ్లం. పాఠశాలలో అందించే అల్పాహారం చాలా బాగుండేది. రుచికరంగా ఉండేది. ఉప్మా, పూరీ వంటివి రోజుకో రకం వండి పెట్టే వాళ్లు. కానీ ఇప్పుడు మా పాఠశాలలో టిఫిన్ వండి పెట్టడం లేదు. దీంతో ఇంటి దగ్గరే తిని వస్తున్నాం.
-ఎం.సాత్విక్, సుజాతగర్ ప్రాథమిక పాఠశాల
చిన్న పిల్లలకు బడుల్లో టిఫిన్ పెట్టడం వల్ల కూలి పనులకు వెళ్లే తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పేవి. పేదవాళ్లే కదా సర్కారు బడులకు వచ్చేది. ఇలాంటి పథకాన్ని కూడా రాజకీయంగా తీసేస్తే ఎలా? సర్కారు బడులకు పిల్లల సంఖ్య ఎలా పెరుగుతుంది? ఇలాంటి మంచి పథకాలను నీరుగారిస్తే ఎలా? వ్యవసాయ పనులకు వెళ్లే పేద కుటుంబాల వారు ఉదయాన్నే సద్ది కట్టుకొని వెళ్తారు. ఇకవారు పిల్లలకు పిల్లలకు టిఫిన్ ఎప్పుడు చేసిపెట్టగలరు? కొత్త ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా ఆలోచించకపోతే ఎలా?
-లావుడ్యా సత్యనారాయణ, గ్రామస్తుడు, సీతంపేట
పిల్లలకు స్కూల్లో టిఫిన్ పెట్టడం బాగానే ఉంది. కానీ కొత్త సర్కారు మాకు ఇంత వరకూ బిల్లులు చెల్లించలేదు. దీంతో మేం పిల్లలకు అల్పాహారం వండి పెట్టలేపోతున్నాం. గత బిల్లులే ఇంత వరకూ ఇవ్వలేదు. కిరాణా షాపులో రూ.80 వేలు బాకీ పడ్డాం. వాళ్లు నిత్యం మందలించి బకాయిలు చెల్లించాలంటూ అడుతున్నారు. దీంతో మేం కూడా వారి దుకాణం వైపు వెళ్లలేకపోతున్నాం. భార్యాభర్తలం కలిసి విద్యార్థులకు ఇన్నాళ్లూ వంట చేసిపెట్టినా మాకు తిండి ఖర్చులు కూడా రాలేదు.
-షేక్ సైదాని, ఖాసీం, వంటవర్కర్లు, సుజాతనగర్
జిల్లాలో గతంలో 23 పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం కొనసాగింది. గత ఏప్రిల్ నుంచి జిల్లాలో కొనసాగించడం లేదు. ఈ పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రస్తుతానికి ఈ విద్యాసంవత్సరంలో జిల్లాలో ఈ పథకాన్ని నడిపించడం లేదు. ఇప్పటి వరకూ వంట చేసిన వాళ్ల బిల్లులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ మధ్యే కొంత బడ్జెట్ వచ్చింది.
-వెంకటేశ్వరాచారి, డీఈవో, భద్రాద్రి