ఆణిముత్యంలాంటి జేకే 5 ఓసీ గని ఈ ఉగాదికి మూతపడనుంది. బొగ్గు నిక్షేపాలు అయిపోవడంతో గనిని మూసివేసేందుకు సింగరేణి యాజమాన్యం సమాయత్తమైంది. దీంతో బొగ్గుకు పుట్టినిల్లు అయిన బొగ్గుట్ట(ఇల్లెందు) చీకటిమయంకానుంది. దేశానికి బొగ్గును మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన ఇల్లెందు పేరు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎంతోమందికి భవిష్యత్తుతోపాటు దేశానికి వెలుగులు నింపిన బొగ్గుట్ట నేడు అంధకారంలోకి వెళ్లనున్నది. ఇల్లెందు ఏరియాలో పరోక్షంగా జీవనోపాధి పొందుతున్న వ్యాపార, వాణిజ్యవర్గాలు సైతం ఆందోళనలో ఉన్నారు. ఒక్కొక్కటిగా ఇల్లెందులో ఉన్న గనులు మూతపడుతూ చివరిగా మిగిలిన జేకే 5 ఓసీ కూడా మూసివేత దిశగా ఉండడంతో ఇక్కడి ప్రజలు జీవనోపాధి కోసం వలసలు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
– ఇల్లెందు రూరల్, మార్చి 8
ఇల్లెందు ఏరియాకు గుండెకాయ లాంటి జేకే 5 ఓసీ గని ఉగాదికి ఇల్లెందుకు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్నది. దీనికోసం అధికారులు ప్రయత్నాలు ప్రారంభించి పరోక్షంగా అల్టిమేటం జారీ చేస్తున్నారు. దీంతో కార్మికులు ఓసీ బంద్ అయితే విధుల కోసం ఏ ప్రాంతంలో సర్దుబాటు చేస్తారోనని మదనపడుతున్నారు. ఏరియాకు మిగిలింది ఇక కేవోసీ(కోయగూడెం ఓపెన్‌కాస్ట్) ఒక్కటే. జేకే 5లో పనిచేస్తున్న సుమారు 250మంది కార్మికులను కేవోసీకి బదిలీ చేసేందుకు యాజమాన్యం సిద్ధమైందని పలువురు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
ఒకవేళ అదే జరిగితే ఇల్లెందు నుంచి కేవోసీకి వెళ్లి విధులు నిర్వర్తించి తిరిగి మళ్లీ ఇల్లెందుకు ఉద్యోగులు చేరడం కష్టంతో కూడిన పని. అందరూ రిటైర్మెంట్కు దగ్గర ఉండడం, వయస్సు మీదపడడంతో కార్మికులు దూరప్రాంతాల్లో విధులు నిర్వహించడం కష్టం. ఇకపోతే జేకే ఓసీ పుణ్యమా అని పరోక్షంగా జీవనోపాధి పొందుతున్న మరో 100మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పర్మినెంట్ కార్మికులే సర్దుబాటు లేక తిప్పలు పడుతుంటే ఇక తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
తమను తీసివేస్తే కుటుంబాలు రోడ్డునపడతాయని బాధపడుతున్నారు. ఇల్లెందుకు చెందిన చిట్టచివరి గని జేకే 5 ఓసీ మూతపడితే పర్మినెంటు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకేకాక పరోక్షంగా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారవర్గాలు, వాణిజ్య సముదాయాలపై భయంకరంగా ప్రభావం ఏర్పడుతుంది. ఆర్థికంగా మరింత నష్టాన్ని ప్రజలు చవిచూడక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూసపల్లి ఓసీని వెంటనే ప్రారంభిస్తే కొద్దిమేర ఊరట లభిస్తుందని కోరుతున్నారు.
బొగ్గుట్ట చరిత్రలోనే జేకే 5 ఓసీ ఓ తలమానికం. 1983లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్ ఖని(జే.కే)గా నామకరణం చేసింది. 1986లో ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి నాణ్యమైన బొగ్గును నాటి అధికారులు, కార్మికులు, సూపర్వైజర్లు ఉత్పత్తికి కృషిచేశారు. 1983 నుంచి 2007 వరకు అండర్‌గ్రౌండ్ మైన్‌గా ఉన్న జేకే గని ఆ తరువాత జేకే 5 ఓసీగా నామకరణం చేసి ఉపరితల గనిగా మార్చారు.
సుమారు 24 సంవత్సరాలు అండర్‌గ్రౌండ్‌గా గని సేవలందించింది. తదనంతరం 2007-08 నుంచి నేటివరకు అనగా 18 సంవత్సరాలు నిరంతరాయంగా ఉపరితల గనిగా బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతను చేపట్టి ఇల్లెందు ఏరియాకు గుండెకాయలా పనిచేసింది. ఎన్నో అవార్డులు, రికార్డులు ఈ గని సొంతం చేసుకుంది. మొన్నటికిమొన్న దేశంలోనే అత్యుత్తమ గనిలో జేకే 5 ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డును సొంతం చేసుకుంది.
ఇల్లెందు ఏరియాలో పూసపల్లి ఓసీని త్వరగా ప్రారంభిస్తే జేకే 5 ఓసీ గనిలో ఉన్న కార్మికులను అందులో సర్దుబాటు చేయవచ్చు. ఈలోపు జేకే 5 ఓసీని మూసివేస్తే కార్మికులకు ఇబ్బందులు తప్పవు. ఇల్లెందు పట్టణ ప్రాంతం పూర్తిగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుంది. ఇతర ప్రాంతాలకు కార్మికులు వలస వెళ్తే కుటుంబాలు తరలిపోతాయి. ఇల్లెందు చిమ్మచీకటి అవుతుంది. అభివృద్ధి తిరోగమనం దిశగా ప్రయాణిస్తుంది.
– జాఫర్‌ఖాన్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు, ఇల్లెందు ఏరియా
మార్చి 31న జేకే ఓసీని మూసివేసేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధమవుతోంది. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అందరూ రిటైర్మెంట్ దగ్గరకు ఉండడం, వయసు రీత్యా వృద్ధాప్యంలో ఉన్నారు. నూతన ఓసీ ఏర్పాటయ్యే వరకు జేకే 5 ఓసీ కాలపరిమితి పెంచాలి. 2018లోనే ఓసీని బంద్ చేస్తామని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకోగా టీబీజీకేఎస్ యూనియన్, బీఆర్ఎస్ నాయకులు నాటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి గనిని నడిపించే విధంగా చర్యలు తీసుకున్నారు. పూసపల్లి ఓసీ ప్రారంభమయ్యే వరకు జేకే ఓసీని కొనసాగించేలా గుర్తింపు సంఘం యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలి.
– రంగనాథ్, టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఇల్లెందు ఏరియా
సింగరేణి యాజమాన్యం ఇల్లెందు ఏరియా జేకే 5 ఓసీ గని మూసివేతపై పునరాలోచించాలి. కొంతమంది కార్మికులు బీపీ, షుగర్, గుండె, కిడ్నీ సమస్యలతో విధులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం వీరందరూ పదవీ విరమణకు దగ్గరగా ఉన్నారు. చివరి సమయంలో వీరందరిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తారని భయాందోళన చెందుతున్నారు. నూతన ఓసీ ఏర్పాటు అయ్యేంత వరకు కార్మికులకు ఇక్కడే అవకాశం ఇవ్వాలి.
– అబ్దుల్ నబీ, సీపీఎం నాయకుడు, ఇల్లెందు
జేకే 5 ఓసీ కార్మికులందరూ ఆందోళన చెందుతున్నారు. పర్మినెంట్ కార్మికులు సుమారు మూడువందల మందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తే ఆరోగ్యపరంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు. అందరూ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవాళ్లే. పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు సైతం పూర్తిగా నష్టపోతారు. యాజమాన్యం మరింత గడువును పెంచి నూతన ఓసీ ప్రారంభమయ్యేంత వరకు ఇక్కడే సర్దుబాటు చేయాలి.
– యాకూబ్షావలి, టీయూసీఐ రాష్ట్ర నాయకుడు, ఇల్లెందు ఏరియా.