భద్రాద్రి జిల్లాలో పోడు వివాదాలు మళ్లీ మొదలవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెల్లగా పెరుగుతున్నాయి. తమ బతుకు పోరాటంగా గొత్తికోయలు అటవీ భూములను నరికి పంటలు సాగుచేస్తున్నారు. వృత్తి, ఉద్యోగ ధర్మంలో భాగంగా అటవీ అధికారులు.. ఆ అడవుల నరికివేతను అడ్డుకుంటున్నారు. దీంతో వీరి మధ్య ఘర్షణలు మొదలవుతున్నాయి. అవి పెరిగి పెద్దవై అటవీ అధికారులపై గొత్తికోయలు దాడులు చేసే వరకూ వెళ్తున్నాయి. అయితే, రాష్ట్రంలోని పోడు సమస్యకు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయిలో పరిష్కారం చూపారు. భద్రాద్రి జిల్లాలో అత్యధికంగా పోడు భూములకు పట్టాలు అందించారు.
వాటికి రైతుబంధు, రైతుబీమా పథకాలూ వర్తింపజేశారు. పోడు భూములకు పూర్తిస్థాయిలో పట్టాలు ఇచ్చినందున ఇకనుంచి అడవులు నరకవద్దని, ఆదివాసీలు, గిరిజనులు, గొత్తికోయలే అడవులను కాపాడే బాధ్యత తీసుకోవాలని సూచించారు. దీంతో అడవుల నరికి వేతలు, పోడు వివాదాలు సమసిపోయాయి. కానీ రేవంత్ ప్రభుత్వం వచ్చా మళ్లీ పోడు వివాదాలు రాజుకుంటున్నాయి. గొత్తికోయలకు, అటవీ అధికారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ట్రెంచ్ కొడుతున్న అటవీ సిబ్బందిపై గొత్తికోయలు మళ్లీ దాడులు చేసే వరకూ వివాదాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలో తాజా గణాంకాల ప్రకారం భద్రాద్రి జిల్లాలో 3,653 ఆదివాసీ కుటుంబాల వద్ద 27 వేల ఎకరాలు పోడు భూములు ఉండడం గమనార్హం.
-భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 15 (నమస్తే తెలంగాణ)
కొండకోనల్లో, ఆదివాసీ గూడేల్లో నివసిస్తున్న ఆదివాసీలు, గొత్తికోయలకు పలు శాఖల అధికారులు సౌకర్యాలు కల్పిస్తున్నారు. సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. మండల పరిషత్ అధికారులు ఉపాధి హామీ కార్డులను, ఐసీడీఎస్ అధికారులు ఆదివాసీ చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని, వైద్యారోగ్య శాఖ అధికారులు వైద్య సేవలను, పోలీసు శాఖ అధికారులు ఆదివాసీ యువతకు క్రీడల కిట్లను అందిస్తున్నారు. పలు సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. దీంతో ఆయా శాఖల అధికారులతో ఆదివాసీలు, గొత్తికోయలు సఖ్యతగా ఉంటున్నారు. కానీ అడవులు నరకొద్దంటూ ట్రెంచ్ కొడుతున్న అటవీ అధికారులపై మాత్రం గొత్తికోయలు తిరగబడుతున్నారు. తమ జీవన పోరాటానికి అటవీ అధికారులు అడ్డువస్తున్నారన్న కోపంతో వారిపై దాడులకు సైతం పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడవులను నరకొద్దంటూ పోలీసులు, అటవీ అధికారులు వెళ్లి ఆదివాసీలు, గొత్తికోయలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రయోజనం కన్పించడం లేదు.
పోడు పేరిట అడవిని నరకవద్దని చెప్పినందుకు, అడవులకు వెళ్లకుండా ట్రెంచ్‌లు (పెద్ద కందకాలు తవ్వినందుకు) కొట్టినందుకు అటవీ సిబ్బందిపై గొత్తికోయలు, ఆదివాసీలు కక్ష పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు సిబ్బందిపైనా, అధికారులపైనా దాడులు చేశారు. ఏకంగా ఓ అధికారి హత్య చేసిన ఘటన కూడా ఉంది. గతంలో చుంచుపల్లి మండలం గరీబ్‌పేటలో అటవీ సిబ్బందిపై గొత్తికోయలు కర్రలతో దాడిచేసి గాయపరిచారు.
2023 నవంబర్ 22న చండ్రుగొండ మండలంలో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావును గొడ్డలితో నరికి మరీ హత్యచేశారు. ఇటీవల చుంచుపల్లి మండలం పెనగడప సమీపంలో అటవీ సిబ్బందిపైనా దాడికి దిగారు. మణుగూరు, భద్రాలం అటవీ డివిజన్లలో ట్రెంచ్ కొట్టే సమయంలో సిబ్బందిపై దాడులు చేశారు. అయితే, ఐటీడీఏ, రెవెన్యూ సహా పలు శాఖల అధికారులు.. గొత్తికోయలకు పథకాలను చేరవేస్తుండడంతో వారి పట్ల గొత్తికోయలు గౌరవంగా వ్యవహరిస్తున్నారు. అయితే, తమను అడవి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న భావనతో అటవీ అధికారులపై మాత్రం ఆగ్రహంగా ఉంటుండడం గమనార్హం.
భద్రాద్రి జిల్లాలో 123 ఆవాస గ్రామాల్లో గొత్తికోయలు నివసిస్తున్నారు. వీరిలో 3,653 కుటుంబాల వారు ఏకంగా 27 వేల ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి పోడు సాగుచేసుకుంటున్నారు. అధికారుల గణాంకాల ప్రకారం.. జిల్లాలో అటవీ విస్తీర్ణం 42,7,725 హెక్టార్లు. వీటిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలిచ్చిన పోడు భూములు 1,51,195 ఎకరాలు. తాజాగా గొత్తికోయల ఆక్రమణలో ఉన్న పోడు భూమి 26,688 ఎకరాలు. కానీ, ఇంకా పోడు పేరిట అడవులను నరుకుతున్న సంఘటనలు కూడా జరుగుతూనే ఉన్నాయి.
ఆదివాసీలు అడవిని నమ్ముకుని బతుకుతున్నారు. ఒకటీ రెండు ఎకరాలు తప్ప వారు పెద్దగా సాగు చేసుకోరు. బతకడానికి వలస వస్తున్నారు. వారిని బతకనిస్తే మనకు అండగా ఉంటారు. అన్ని శాఖలు సాయం చేసినట్లు అటవీ శాఖ కూడా సాయం చేయాలి. కానీ దాడులు చేయొద్దు. వలసొచ్చిన వారిపై ప్రతాపం చూపించడం తగదు. జీవించడం కోసమే వారు పోడు వ్యవసాయం చేస్తున్నారు.
– వాసం రామకృష్ణ, ఆదివాసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు
ఆక్రమణలో ఉన్న పోడు భూములను కాపాడేందకు ట్రెంచ్‌లు వేస్తున్నాం. గొత్తికోయలు అటవీశాఖ సిబ్బందిపై దాడులు చేస్తున్నారు. ఇది మంచిపద్ధతి కాదు. జిల్లాలో మూడుచోట్ల దాడులు చేశారు. వారిపై కేసులు పెట్టాం. అడవిని నాశనం చేస్తే చర్యలు తప్పవు. అన్నిశాఖల అధికారులతో కలిసి గొత్తికోయలకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అటవీ భూమిని కాపాడడం మా విధి, మా బాధ్యత.
– కృష్ణగౌడ్, జిల్లా అటవీశాఖ అధికారి, భద్రాద్రి