కొత్తగూడెం గణేశ్టెంపుల్/ ఖమ్మం కమాన్బజార్, జూన్ 10: ప్రధాని నరేంద్రమోదీ.. దేశంలోని కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పేదల పొట్టుగొడుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసర సరుకుల ధరల పెంపుదలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో భద్రాద్రి కలెక్టరేట్ ముట్టడిని బుధవారం చేపట్టారు. ధరలు తగ్గించాలని నినాదాలు చేస్తూ ర్యాలీగా వచ్చిన సీపీఐ నాయకులు, కార్యకర్తలు.. కొత్తగూడెం కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీపీఐ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగాయి. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. నిత్యావసర వస్తువుల ధరలు, చమురు ధరలు అమాంతం పెంచుతూ సామాన్యులపై భారం మోపడం దర్మార్గమని దుయ్యబట్టారు. ప్రజా ఉద్యమాల ద్వారా పాలకుల కళ్లు తెరిపిస్తామని హెచ్చరించారు. ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు.
మోడీ పాలనలో భారతదేశం ఆర్థిక పతనం దిశగా పయనిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఖమ్మంలో సీపీఐ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు సీపీఐ శ్రేణులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. ప్రజలపై ధరాభారం మోపుతున్న ప్రధాని మోదీకి వ్యతిరేకంగా యావత్ ప్రజానీకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
అలాగే, రాష్ట్రంలో కూడా చమురు ధరలను నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ.. దానిని ఆదాయ వనరుగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. ధరలను నియంత్రించలేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఈ రెండున్నరేళ్లలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీలు అమలుచేస్తారేమోనని తామూ ఇన్నాళ్లపాటు ఎదురుచూశామని అన్నారు. ఇప్పటికీ రేవంత్ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతోనే ఆందోళన బాటపట్టామని స్పష్టం చేశారు. ‘అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా సరిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ప్రజలను విస్మరిస్తే తగు మూల్యం అనుభవించక తప్పదు’ అని హెచ్చరించారు. సీపీఐ నేతలు పాల్గొన్నారు.