ఖమ్మం రూరల్, మార్చి 27 : మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణ మాఫీ వర్తించేలా చూడాలని ఖమ్మం రూరల్ మండల పరిధిలోని కస్నాతండాకు చెందిన గిరిజన రైతు భూక్య నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. సర్కారు వైఖరిని నిరసిస్తూ గురువారం వినూత్న రీతిలో నిరసనకు దిగాడు. మెడలో మిర్చి దండ వేసుకుని, చేతిలో ప్లకార్డు ధరించి మిర్చి కళ్లంలోనే అర్ధ నగ్నంగా కూర్చుని నిరసన చేపట్టాడు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అరకొరగా అమలు చేసిందని దుయ్యబట్టాడు.
తాను సైతం రూ.2,50,000 పంట రుణం తీసుకోగా, గత సంవత్సరం జూలై నెలలో బ్యాంక్ అధికారుల ఒత్తిడి మేరకు ప్రైవేట్ ఫైనాన్స్‌లో అప్పు తీసుకొచ్చి అసలు, వడ్డీ కలిపి రూ.2,70,000 చెల్లించినట్లు చెప్పాడు. త్వరలోనే రుణమాఫీ వస్తుందని అధికారులు చెబుతున్నప్పటికీ నేటి వరకు రుణమాఫీ కాలేదని వాపోయాడు. దీనికి తోడు కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగు చేస్తే, పంట తీసిన కూలీలకు కూడా ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించి, తక్షణం ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ వర్తించే విధంగా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.