రఘునాథపాలెం, ఏప్రిల్ 8: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతు నిలువు దోపిడీకి గురవుతున్నారు. మార్కెట్లో తిష్ట వేసుకొని కూర్చున్న వ్యాపారులు ‘మేం చెప్పిందే ధర.. చేసిందే శాసనం’ అన్నట్లుగా వ్యవహరిస్తూ అన్నదాతలను నిలువునా ముంచుతున్నారు. జెండా పాటతో సంబంధం లేకుండా మిర్చి విక్రయాలను జరుపుతూ రైతులను నిండా మోసం చేస్తున్నారు. ఫలితంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ‘ఎర్ర బంగారం’ ధర దారుణంగా పతనమవుతోంది. రోజురోజుకూ క్షీణించిపోతోంది. ఈ మధ్య కూడా ఒకానొక దశలో రూ.14 వేలకు చేరిన క్వింటా ధర.. నాలుగు రోజుల్లోనే మళ్లీ రూ.800 పతనమైంది.
నిరుడు ఇదే సమయంలో ఈ మార్కెట్లో క్వింటా రూ.23 వేలకు పైచిలుకు ఉన్న మిర్చి ధర ఇప్పుడు దాదాపుగా సగం ధరే పలుకుతోంది. మార్కెట్లో తిష్టేసిన దళారులే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. నిరుడు ఇదే మార్కెట్లో రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకూ వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేశారు. క్వింటా రూ.30 వేలకు చేరుతుందని ప్రచారం జరిగింది. దీంతో వ్యాపారులంతా పెద్ద ఎత్తున రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు.
అయితే నాడు మార్కెట్ వ్యాపారుల ఆశలు అడియాశలయ్యాయి. రైతుల వద్ద నుంచి వ్యాపారుల చేతికి పంట వచ్చాక ఆఖర్లో ధర కొంత తగ్గిపోయింది. దీంతో చేసేదేమీలేక వ్యాపారులందరూ ఆ పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకోలేక అగ్గువకు అమ్ముకున్నారు. దీంతో వారంతా నిరుటి నష్టాలను పూడ్చుకునే ఆలోచన చేసి ఈ ఏడాది సిండికేట్ అయ్యారు. ఫలితంగా మిర్చి ధర క్వింటా రూ.13,300 వద్దనే ఆగిపోయింది. ఈ ఏడాది సీజన్ మొదట్లో రూ.14 వేలకు చేరినప్పటికీ ఆ తరువాత రోజురోజుకూ తగ్గుముఖం పడుతూ వస్తోంది.
చివరకు నాణ్యమైన మిర్చి ధరను కూడా గరిష్టంగా రూ.13,500 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇక తేమ శాతం, రంగు వంటి కారణాలు చూపుతూ రైతుల పంటను తిరస్కరిస్తున్నారు. లేదంటే తాము చెప్పిన తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో రోజురోజుకూ తగ్గుతున్న ధర.. మిర్చి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నిరుడు సిరులు కురిపించిన మిర్చి ఈ ఏడాది రూ.13 వేలకు దిగువన రావడంతో మిర్చి రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
తెగుళ్లు, వరదలతో తగ్గిన దిగుబడి..
ఈ ఏడాది అధిక ధర లభిస్తుందన్న కారణంతో రైతులు కూడా ఎక్కువ విస్తీర్ణంలో మిర్చిని సాగు చేశారు. కానీ.. ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. తెగుళ్లు, వరదలు, వాతావరణ పరిస్థితులు దెబ్బతీయడంతో దిగుబడి బాగా తగ్గింది. దీంతో డిమాండ్ పెరిగి అధిక ధర పలుకుతుందని రైతులంతా ఆశించారు. తీరా మార్కెట్కు వస్తే భంగసాటే మిగిలింది. వ్యాపారులంతా సిండికేట్ కావడంతో ధరలు గణనీయంగా పడిపోయాయి.
గత వారం రోజులుగా రోజుకు రూ.200 నుంచి రూ.300 చొప్పున తగ్గుతూ వస్తున్నదే తప్ప పెరిగిన పరిస్థితి లేదు. దీంతో వ్యయ ప్రయాసలకోర్చి మార్కెట్లో విక్రయించుకునేందుకు పంటను తీసుకొచ్చిన రైతులకు వ్యాపారులు సగటున రూ.13 వేల వద్ద ధరలు చెబుతున్నారు. దీంతో తిరిగి తీసుకెళ్లేందుకు మళ్లీ ఖర్చులు భరించలేని రైతులు.. వ్యాపారులు చెప్పిన ధరకే విక్రయించుకొని నిలువు దోపిడీకి గురవుతున్నారు. దీనికితోడు రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయేమోనన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది. అయితే, ఈ ఏడాది చైనాకు మిర్చి ఎగుమతులు లేకపోవడంతోనే ధర తగ్గుదలకు కారణమని కొందరు వ్యాపారులు చెబుతున్నారు.
అగ్గువకు అమ్మలేక నిల్వ చేద్దామనుకుంటున్నా..
మేం కష్టపడి పండించి తెచ్చిన పంటకు మేం ధర నిర్ణయించే అవకాశం లేకపోయింది. కానీ.. మార్కెట్లోని వ్యాపారుల మాత్రం కళ్లతో చూసి పంట ధర నిర్ణయిస్తున్నారు. మంగళవారం జెండాపాటలో రూ.13,500 ధర పలికింది. నాణ్యమైన మిర్చిని తెస్తే జెండాపాటలో కొనకుండా రూ.11 వేలకు అడిగారు. ‘ఇస్తే ఇవ్వు.. లేకపోతే ఇంటికి పట్టుకెళ్లు..’ అంటూ వెళ్లిపోయారు. చేసేదీమీలేక కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేద్దామని తీసుకెళ్తున్నా.
-బాదావత్ జగదీశ్, మిర్చి రైతు, తిరుమలాయపాలెం
మరీ తక్కువ ధర చెబుతున్నారు..
క్వాలిటీ మిర్చికి కూడా వ్యాపారులు మరీ తక్కువ ధర చెబుతున్నారు. జెండా పాటతో సంబంధం లేకుండా ధరను నిర్ణయిస్తున్నారు. మరి జెండాపాట ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తే.. ‘ఆ పని అధికారులు చేస్తారు. మేం కొనే ధరకు మేము కొంటాం’ అంటూ వ్యాపారులు చెబుతున్నారు. వారి దోపిడీని అధికారులు పట్టించుకోరు.
-హలావత్ హార్యా, కూసుమంచి